ఎమ్మెల్సీ కవిత సంబరం.. కొంపముంచింది

ఇది కరోనా కాలం. సంబురాలు చేసుకునే సమయం కాదు. మూకుమ్మడిగా కలవడం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం అత్యంత ప్రమాదకరం. ఇవన్నీ తెలిసి కూడా నిన్నంతా కవిత చుట్టూ చాలా హంగామా నడిచింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన…

ఇది కరోనా కాలం. సంబురాలు చేసుకునే సమయం కాదు. మూకుమ్మడిగా కలవడం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం అత్యంత ప్రమాదకరం. ఇవన్నీ తెలిసి కూడా నిన్నంతా కవిత చుట్టూ చాలా హంగామా నడిచింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఎగబడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కావడంతో ఆ అత్యుత్సాహం ఇంకాస్త ఎక్కువ కనిపించింది.

అదే ఇప్పుడు కొంపముంచింది. కవితకు శుభాకాంక్షలు చెప్పిన వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో ఎమ్మెల్సీగా గెలిచిన మరుసటి రోజే కవిత హోం ఐసొలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల ఓ వేడుకకు హాజరయ్యారు సంజయ్. అక్కడ ఆయనకు కరోనా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తు కరోనా పరీక్షలు నిర్వహించగా.. సంజయ్ కు పాజిటివ్ అని నిర్థారణ అయింది. కవితకు  ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలిపిన వ్యక్తుల్లో ఆయన కూడా ఉన్నారు.

దీంతో కవిత, 5 రోజుల పాటు హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఎవ్వర్నీ ఆమె కలవడం లేదు. ప్రస్తుతానికైతే కవితకు ఎలాంటి లక్షణాలు బయటపడలేదంటున్నారు అధికారులు. సంజయ్ తో పాటు ఉన్న వ్యక్తులంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.