తమిళనాట భారతీయ జనతా పార్టీ చేరికల మీద దృష్టి సారించింది. ఇన్నాళ్లూ తమ మీద దుమ్మెత్తి పోసిన కుష్బూకు కూడా బీజేపీ కాషాయ తీర్థం ఇచ్చింది. బీజేపీని నియంతృత్వ పార్టీగా అభివర్ణిస్తూ చాలా కాలంగా ట్వీట్లేసిన కుష్బూ ఇప్పుడు అదే పార్టీలోకి చేరిపోయారు.
అసలు కుష్బూ ఇది వరకూ వ్యక్తీకరించిన అభిప్రాయాలకూ, బీజేపీకి కూడా పొంతన కుదరదు. ప్రీ మ్యారిటల్ సెక్స్ తో సహా వివిధ అంశాల గురించి చాలా లిబరల్ గా స్పందించింది కుష్బూ. అప్పట్లో కుష్భూ పోస్టర్లు తగలబెట్టడంలో కమలదళం ముందుంది.
ఇక నుంచి కుష్బూ ఎలా స్పందిస్తుందో! ఆ సంగతలా ఉంటే.. కుష్బూ చేరిక నేపథ్యంలో మరో స్టార్ హీరో కూడా బీజేపీలోకి చేరబోతున్నాడని, ఆయన మరెవరో కాదు తమిళ స్టార్ హీరో విజయ్ అనే ప్రచారం ఊపందుకుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలు ఇప్పటివి ఏమీ కావు. అయితే అతడు బీజేపీలోకి చేరబోతున్నాడనే విడ్డూరమైన ప్రచారం ఒకటి సాగింది.
గత కొన్నాళ్లుగా విజయ్ అంటే బీజేపీకి అస్సలు పడటం లేదు. అతడి సినిమాల్లో కేంద్ర ప్రభుత్వంపై పడ్డ సెటైర్లతో బీజేపీ వాళ్లు విరుచుకుపడ్డారు. జోసెఫ్ విజయ్ అంటూ విజయ్ క్రిస్టియన్ అనే విషయాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్లు. అలాంటిది విజయ్ బీజేపీలోకి చేరబోతున్నాడనే ప్రచారం ఏ మాత్రం నమ్మశక్యంగా నిలవలేదు.
ఈ క్రమంలో విజయ్ తండ్రి చంద్రశేఖరన్ స్పందించారు. విజయ్ బీజేపీలోకి చేరబోతున్నాడనే ప్రచారంతో అనేక మంది తనకు ఫోన్లు చేశారని.. దీంతో క్లారిటీ ఇస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీలోకి చేరే ఉద్దేశం విజయ్ కు ఏ మాత్రం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.