బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో తెలంగాణలో జోరుగా వానలు కురుస్తున్నాయి. అవి కాస్తా ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ.. తూర్పు-మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర-పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
మరో 2 రోజుల పాటు తెలంగాణలో జోరుగా వానలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ను మరోసారి వాన ముంచెత్తడం ఖాయం అంటున్నారు. నిన్నట్నుంచే హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. 4 రోజుల కిందట కురిసిన వానకే నగరం తడిసి ముద్దయింది. ఫ్లై ఓవర్ల కింద నీరు నిలిచిపోయింది. తాజా వర్షాలకు రోడ్లు కంటికి కనిపించడం లేదు.
4 రోజుల కిందట కురిసిన 15 సెంటీమీటర్ల వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవ్వగా.. నిన్నట్నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు 16 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఈ రాత్రికి రికార్డు స్థాయిలో హైదరాబాద్ లో వర్షపాతం నమోదవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. లోతట్టు ప్రాంత వాసులంతా ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.