సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోరు జారడంలో తనకు తానే సాటి. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియని మైకంలో ఆయన ఉంటారు. దిశ దోషుల ఎన్‌కౌంటర్‌పై సానుకూలంగా స్పందించిన నారాయణ …ఆ తర్వాత సొంత పార్టీ పెద్దలు మొట్టికాయలు వేయడంతో తప్పైందని క్షమాపణలు చెప్పారు.
ఇలాగే ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎంతో అందంగా ఉంటుందని కామెంట్ చేసి..విమర్శలు రావడంతో సారీతో సరిపెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌ను బఫూన్‌గా అభివర్ణించి…. తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకున్నారు.
ఈయన మాత్రం నోరు జారడం, వెనక్కి తీసుకోవడం సర్వసాధారణమైంది. కానీ జగన్ మాత్రం ఒకే మాటపై ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగితే సమస్య లేదు.
రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు స్వాగతించారు. వారిపై సీపీఐ జాతీయ కార్యదర్శి ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు.
‘రాజధానిపై జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆత్మాభిమానం, తల్లిదండ్రులు, భార్యాబిడ్డల మీద ప్రేమ ఉన్నవారెవరికైనా తమ ప్రాంతం నుంచి రాజధాని వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఓటర్లను, రాజధానిని కాపాడుకోలేని వారు భార్యాబిడ్డలను ఎలా సంరక్షించుకుంటారు? ఇలాంటి వాళ్లను మనం ఎన్నిక చేసుకున్నాం’ అని ఆయన విమర్శించారు.
నారాయణ స్వస్థలం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని ఐరంబాకం. జీవిత భాగస్వామిని వసుమతి నెల్లూరు జిల్లా గూడూరు. సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వస్థలం కర్నూలు జిల్లా. చదువు, రాజకీయ జీవితమంతా అనంతపురం కేంద్రంగానే సాగాయి. అంటే వీరిద్దరికి రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమనే.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమకు రాజధాని ఇవ్వాలని ఎప్పటి నుంచో రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సరే రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసుకున్నారు. కనీసం హైకోర్టు అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబుకు చెవికెక్కలేదు. దాన్ని కూడా చంద్రబాబు సర్కార్ అమరావతిలో ఏర్పాటు చేసింది. ఎప్పుడైనా రాయలసీమ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని సీపీఐ జాతీయ, రాష్ట్ర స్థాయిలో కీలకనేతలైన వీరిద్దరు మాట్లాడారా? ఎప్పుడూ లేదు.
జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన కృష్ణా , గుంటూరు జిల్లాల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం, తల్లిదండ్రలు, భార్యాబిడ్డల మీద ప్రేమ ఉన్న వారెవరికైనా తమ ప్రాంతం నుంచి రాజధాని వెళ్లి పోతుంటే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్ననారాయణకు, అదే ప్రశ్న తనకే వేసుకోవాలని ఎందుకు అనిపించలేదు? రాయలసీమను కాదని అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినప్పుడు నారాయణ నోరెత్తకపోగా…శంకుస్థాపనకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు.
ఓటర్లను, రాజధానిని కాపాడుకోలేని వారు భార్యాబిడ్డలను ఎలా సంరక్షించుకుంటారని ప్రశ్నిస్తున్న నారాయణా…ఇప్పటికే ఎటూ మీరు ఓటర్లను కాపాడుకోలేకపోయారనే విషయం అందరికే తెలిసందే. మరి మీ భార్యాబిడ్డలను మీరే సంరక్షించుకుంటున్నారా అని ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు ఏమి చెబుతారు? నరం లేని నాలుక ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే వ్యక్తిగతంగా నారాయణతో పాటు కమ్యూనిస్టు పార్టీకి తలవంపులు అనే విషయాన్ని ఇప్పటికీ గుర్తించపోవడం సిగ్గుచేటు.
అమరావతి నిర్మాణానికి చంద్రబాబు బ్రహ్మాండమైన పునాదులు వేశారని, కేంద్రం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఇచ్చి ఉంటే పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తయ్యేవని, జగన్‌కు అవకాశం వచ్చి ఉండేది కాదని చెప్పడాన్ని బట్టి మీరు ఎవరి కోసం, ఎందుకోసం మాట్లాడారో తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు. మహిళలతో కన్నీరు పెట్టిస్తున్న ప్రభుత్వం నాశనమైపోతుందని జగన్ సర్కార్‌పై శాపనార్థాలు పెడుతున్న నారాయణకు మిగిలిన ప్రాంతాల్లోని మహిళలు, రైతులు, కూలీల కన్నీళ్లు కనిపించలేదా? ఇలా చంద్రబాబును ఎప్పుడైనా మాట్లాడారా?