విశాఖ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఏం మాట్లాడుతారోనని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన వారికి చివరికి నిరాశే మిగిలింది. ‘మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ రోజు విశాఖ ఉత్సవాలను ఇప్పుడే ఇక్కడే ప్రారంభిస్తున్నాం’ అని సీఎం జగన్ అనగానే లేజర్ షో ద్వారా విశాఖ ఉత్సవ్ ప్రారంభమైంది. ఈ మాటలు తప్ప మరో మాటకే జగన్ అవకాశం ఇవ్వలేదు.
ఈ నెల 17న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఉండొచ్చని ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అమరావతిలో రాజధాని రైతుల ఆందోళన ఒక వైపు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో ఆనందం మరోవైపు.
ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా విశాఖలో జగన్ పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకొంది. విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించడంతో పాటు రూ.1285.32 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. విశాఖ బీచ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి జగన్ ఏం మాట్లాడుతారోనని కుతూహలంతో చాలా మంది టీవీల ముందు కూచున్నారు. అయితే జగన్ విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించి నేరుగా విజయవాడకు బయల్దేరారు.
జగన్ మాట్లాడినా, మాట్లాడక పోయినా సంచలనమే. జగన్ మౌనం కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. రాష్ట్రంలో మూడు రాజధానులపై శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో స్పష్టత వస్తుందని అందరూ ఊహించారు. అయితే రాజధానిపై అధ్యయనానికి మరో హైపవర్ కమిటీ వేయడంతో ముఖ్యంగా రాజధాని రైతులు, ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్ పెరిగింది.
ఈ పరిస్థితుల మధ్య జగన్ విశాఖ పర్యటనపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టారు. అయితే జగన్ ఏమీ మాట్లాడక పోయినా, ఆయన మౌనాన్ని అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంతగా అర్థమైందని చెప్పొచ్చు. ఆయన ప్రతి కదలిక అనేక సందేశాలను సమాజానికి పంపింది. విశాఖ బీచ్‌లో జనసంధ్రాన్ని చూసి జగన్ చిరునవ్వుతో కడలి శృతి కలిపింది.
విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కే బీచ్ వేదిక వరకూ సుమారు 24 కిలోమీటర్ల వరకూ అడుగడుగునా కనీవినీ ఎరుగని రీతిలో జన స్వాగతం లభించింది. తమ ప్రియతమ నాయకుడి కోసం గంటల తరబడి ఎదురు చూసిన జనాభిమానానికి వెల కట్టగలమా?
‘జై జగన్.. జయహో జగనన్, థ్యాంక్యూ జగనన్న’ అనే నినాదాలతో విశాఖపట్నం మార్మోగింది. జగన్ మాట్లాడాల్సింది ఎప్పుడో మాట్లాడారు. జగన్ మాటలకు ప్రతిస్పందనలే ‘జై జగన్.. జయహో జగనన్, థ్యాంక్యూ జగనన్న’ అనే విశాఖ సంస్కారాన్ని, కృతజ్ఞతలను తెలియజేశాయి. తాను మాట్లాడేందుకు జగన్ విశాఖలో పర్యటించలేదు. దాదాపు రూ.1300 కోట్ల పనులే ప్రభుత్వ అడుగులు ఎలా పడుతున్నాయో చెప్పకనే చెప్పాయి.
ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అనధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర గుండె చప్పుడును వినేందుకు విశాఖ బీచ్‌కు వెళ్లారాయన. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఎంత ఆనందంగా ఉందో విశాఖ బీచ్‌లో ఆ కడలి అలల సవ్వడి చెబుతుంటే జగన్ విన్నాడు. ‘నేనున్నానని, ముందుకు సాగాలని’ విశాఖ ఇచ్చిన భరోసాతో కొండంత ఉత్సాహం, ధైర్యాన్ని నింపుకుని జగన్ వెనుతిరిగారు. దట్సాల్.