శేఖర్‌గుప్తా- ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, ‘ది ప్రింట్ ’ఎడిటర్ ఇన్ చీఫ్. ఎక్కడో ఢిల్లీలో ఉన్న శేఖర్‌గుప్తాకు ఒక్కసారిగా జగన్ పాలనపై, మూడు రాజధానుల ప్రకటనపై 20 నిమిషాల వీడియో పెట్టాలనిపించింది.
గత కొంత కాలంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీఎం జగన్‌పై ఏ విమర్శలు చేస్తున్నారో, అవే మాటలు శేఖర్ గుప్తా నోట జాలువారాయి. టీడీపీ స్క్రిప్ట్‌ను శేఖర్‌గుప్తా చదివారనడంలో రెండో మాటకు తావులేదు.
సినిమా ఫంక్షన్లలో యాంకర్ల మాట తీరుగా శేఖర్‌గుప్తా వీడియో మాటలున్నాయనే విమర్శలున్నాయి. జగన్‌ను జాతీయ స్థాయిలో దెబ్బతీయడానికి ఓ కిరాయి కలాన్ని టీడీపీ బ్యాచ్ వెతికి పట్టుకొంది.
ఆ కిరాయి మాటలే శేఖర్‌గుప్తా విమర్శలు. ఎవరైనా కలాన్ని కిరాయికి తీసుకోవాలంటే ఢిల్లీలోని ‘ది ప్రింట్ ’ఎడిటర్ శేఖర్గుప్తాను కలిస్తే సరిపోతుందనే వ్యంగ్యాస్త్రాలు నెటిజన్లు విసురుతున్నారు. ఆ కిరాయి పలుకులోని చిలుకపలుకుల్లో కొన్నింటిని చదువుకుందాం.
మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడం పిచ్చితుగ్లక్ చర్య. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని…ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం జాతీయ విషాదం.
అమరావతి నిర్మాణాన్ని పునరుద్ధరించాలని ఏపీ ముఖ్యమంత్రికి ప్రధాని మోడీ సూచించాలి. మూడు రాజధానులే కాకుండా , విశాఖ, అమరావతిలో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేస్తారట. ఇదంతా చూస్తుంటే తుగ్లక్ డబుల్ కేఫిన్తో 20 కప్పుల కాఫీ తాగి తీసుకున్న నిర్ణయంలా ఉంది.
అమరావతి అంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌దే కాదు. మొత్తం దేశ ప్రయోజనాలు ఆ నగరంలో ఉన్నాయి. అమరావతి ప్రాజెక్టు నిలిపి వేయడం విషాదం. పాలకులకు మంచి బుద్ధి కలిగి అమరావతి ప్రాజెక్టును పునరుద్ధరిస్తే …దేశంలోనే మరీ ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో గొప్ప నగరం అవుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడు. జగన్ శూన్యవాది.
సమున్నత లక్ష్యంతో , ఆకాంక్షలతో అమరావతి నిర్మాణం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో మొదట్నించి పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారంతా కలిసి అమరావతిని అద్భుతంగా నిర్మిస్తారని , ఈ 60 ఏళ్లలో దేశం నిర్మించిన మొదటి గ్రీన్‌ఫీల్డ్ నగరమవుతుందని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.
జగన్ ప్రభుత్వ ధోరణి చూసి ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ, సింగపూర్ కన్సార్షియం వెనక్కి వెళ్లిపోయాయి. లులూ సహా చాలా సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులు విరిమించుకుని వెళ్లిపోయాయి.