అప్పట్లో తెలంగాణ ద్రోహులు…ఇప్పుడు ఉత్తరాంధ్ర ద్రోహులు…!

మీకు గుర్తుందా? తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు, రాష్ట్ర విభజనకు ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని టీఆర్‌ఎస్‌ నాయకులు, తెలంగాణవాదులు తెలంగాణ ద్రోహులుగా…

మీకు గుర్తుందా? తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు, రాష్ట్ర విభజనకు ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని టీఆర్‌ఎస్‌ నాయకులు, తెలంగాణవాదులు తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేశారు. తెలంగాణను కాదన్నవారిని వెలేశారు.

ఇదంతా సామాన్య ప్రజల విషయంలో కాదు. రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల అధినేతల విషయంలో. తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే, ప్రధానంగా హైదరాబాదులో ఉన్న ఆస్తులను, వ్యాపారాలను కాపాడుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైకాపా అధినేత జగన్‌ తదితరులు 'జై తెలంగాణ' అనక తప్పలేదు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వక తప్పలేదు. 

ఇప్పుడు సీఎం జగన్‌ చేసిన 'మూడు రాజధానులు' ప్రకటన తరువాత కూడా ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాంధ్రకు రాజధాని అక్కర్లేదా? ఉత్తరాంధ్ర బాగుపడక్కర్లేదా? అని వైకాపా నాయకులు, మంత్రులు టీడీపీని, ఇతర ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరాంధ్రకు రాజధాని వద్దనేవారు ఆ ప్రాంతానికి ద్రోహులంటున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకోవడంలేదంటున్నారు. ఆ ప్రాంతం బాగుపడటం వీరికి ఇష్టంలేదంటున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్ర సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు. 'ఉత్తరాంధ్రకు రాజధాని అక్కర్లేదు' అని నేరుగా అంటే అక్కడివారి ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుకే అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ఉంచి విశాఖను, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలంటున్నారు. అందుకు తాము వ్యతిరేకం కాదని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. 

నిజానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి కూడా నేతలు వ్యతిరేకంగా మాట్లాడరు. రాజకీయ పార్టీలు మనుగడ సాగించాలంటే, ఎన్నికల్లో ఓట్లు, సీట్లు సంపాదించుకోవాలంటే అన్ని ప్రాంతాల ప్రజలు అవసరమే కదా. కాని వైకాపా నాయకులు విశాఖలో రాజధాని అనేదాన్ని సెంటిమెంటుగా తయారుచేశారు.

ప్రతిపక్షాలు, ప్రధానంగా టీడీపీ విశాఖకు వ్యతిరేకమనే భావన క్రియేట్‌ చేశారు. పార్టీ లైన్‌ ప్రకారం అమరావతికి మద్దతు ఇస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని, ప్రజల తిరస్కరణకు గురికావల్సివస్తుందనే భయంతో విశాఖలోని టీడీపీ నాయకులు విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌కు పూర్తి మద్దతు ఇచ్చారు. 

మూడు రాజధానులు కాన్సెప్టు కారణంగా ఇతర పార్టీలకు నష్టం సంగతి పక్కన పెడితే టీడీపీకే ఎక్కువగా నష్టం కలుగుతోంది. టీడీపీని నిర్వీర్యం చేయడమే జగన్‌ లక్ష్యం కాబట్టి విశాఖ సెంటిమెంటును వైకాపా నేతలు తీవ్రతరం చేశారు. విశాఖ రాజధాని కాకుండా చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని తాజాగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.

విశాఖ రాజధాని కాకుండా న్యాయవ్యవస్థ ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకొని విశాఖకు ద్రోహం చేయబోతున్నారని అన్నారు. ఆయన చేసే ద్రోహం వల్ల ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు విజయసాయి రెడ్డి. అయితే చంద్రబాబు న్యాయ వ్యవస్థ ద్వారా ఎలాంటి చిక్కులు కల్పించబోతున్నారో, ఎలాంటి ఇబ్బందులు పెట్టబోతున్నారో విజయసాయి రెడ్డి చెప్పలేదు. విజయసాయిరెడ్డి ఆరోపణలు సహజంగానే విశాఖవాసులపై ప్రభావం కలిగిస్తాయి. తమకు కలుగుతున్న ప్రయోజనాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారనే భావన  ఏర్పడుతుంది. 

దీంతో టీడీపీకీ భారీ నష్టం కలిగే ప్రమాదముంది. చంద్రబాబు వ్యక్తిగతంగానో, పార్టీ తరపునో కోర్టుకు వెళ్లరు. అలా చేయడం ఆయనకు, పార్టీకి ప్రమాదకరం కాబట్టి అమరావతిలోని రైతులతో పిటిషన్లు వేయిస్తారు. సాధారణంగా ఎవరైనా ఇలా పరోక్షంగానే చేస్తారు. అమరావతి రైతులు ప్రత్యక్షంగా ఉద్యమం చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం ప్రేరణతోనే వారు కోర్టుకు వెళ్లాల్సిన అవసరంలేదు.

వారైవారు సొంతంగా వెళ్లే అవకాశముంది. అలా చేసినా ఆ పని చేయించింది చంద్రబాబేనని వైకాపా వారు ప్రచారం చేయకమానరు. తెలంగాణలో సుదీర్ఘకాలం సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వెళ్లారు కదా. రాజధాని మార్పుతో పోలిస్తే వారిది చిన్న సమస్యే కదా. మరి వారే కోర్టుకు వెళ్లినప్పుడు ఏపీలో అమరావతి రైతులు ఎందుకు వెళ్లరు? ఎంతకాలం రోడ్డు మీద నిలబడి ఉద్యమం చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి తప్పనిసరిగా కోర్టు గడప తొక్కే అవకాశాలుంటాయి.