జ‌డ్జిల నియామ‌కంపై ఎంపీ ప్ర‌సంగం, వెంక‌య్య ప్ర‌శంస‌!

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ్య‌స‌భ స‌మావేశాల్లో కేర‌ళ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మూడు రోజుల కింద‌ట చేసిన ప్ర‌సంగం వెబ్ లో వైర‌ల్ గా మారింది. రాజ్య‌స‌భ‌లో తొలిసారి ప్రసంగించిన ఈ కేర‌ళ సీపీఎం నేత…

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ్య‌స‌భ స‌మావేశాల్లో కేర‌ళ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మూడు రోజుల కింద‌ట చేసిన ప్ర‌సంగం వెబ్ లో వైర‌ల్ గా మారింది. రాజ్య‌స‌భ‌లో తొలిసారి ప్రసంగించిన ఈ కేర‌ళ సీపీఎం నేత జ‌డ్జిల నియామ‌కాల అంశంపై ఆస‌క్తిదాయ‌క‌మైన రీతిలో స్పందించాడు. న్యాయ‌స్థానాల్లో జ‌డ్జిల నియామ‌కంపై ప్ర‌జ‌ల్లో మొద‌లైన చ‌ర్చ‌, రాజ‌కీయ‌, న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఉన్న చ‌ర్చ గురించి జాన్ ప్ర‌స్తావించారు. ఈ ప్ర‌సంగాన్ని రాజ్య‌స‌భ చైర్మ‌న్, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు కూడా మెచ్చుకున్నారు. అంతే కాదు.. ఆ ప్ర‌సంగం గురించి జాతీయ మీడియా పెద్ద‌గా ప్ర‌స్తావించ‌లేద‌ని, ప్ర‌చురించ‌లేద‌ని కూడా వెంక‌య్య అన‌డం విశేషం.

అయితే ఆ ఎంపీ ప్ర‌సంగంలోని పాయింట్ల‌ను డిలీట్ చేస్తున్న‌ట్టుగా అప్పుడు చైర్లో కూర్చున్న ఉప‌స‌భాప‌తి ప్ర‌క‌టించారు. ఇంత‌కీ జాన్ త‌న ప్ర‌సంగంలో ఏం అన్నారంటే.. జ‌డ్జిల నియామ‌కం వ్య‌వ‌హారం తీరుపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని రీతిలో ఇండియాలో సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల నియామ‌కం జ‌రుగుతోంద‌ని అన్నారు. జ‌డ్జిల‌ను జ‌డ్జిలే నియ‌మించుకునే ప‌ద్ధ‌తి ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌ని ఈ ఎంపీ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. జ‌డ్జిల పెన్ష‌న్ కు సంబంధించిన బిల్లుపై చ‌ర్చ స‌మ‌యంలో ఈ క‌మ్యూనిస్టు పార్టీ ఎంపీ.. జ‌డ్జిల నియామ‌కం ప్ర‌క్రియే స‌రిగా లేద‌ని వ్యాఖ్యానించారు. 

జ‌డ్జిల నియామ‌కం అనువంశికంగా మారింద‌ని కూడా ఈ ఎంపీ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం సుప్రీం కోర్టు జ‌డ్జిల్లో ఒక‌రిగా ఉన్న వ్య‌క్తికి సంబంధించి, వారి కుటుంబీకులు ప‌లువురు ఇది వ‌ర‌కూ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యం ఉన్నారు. ఆ జ‌డ్జి త‌ల్లి వైపు నుంచి, తండ్రి వైపు నుంచి ప‌లువురు ఇప్ప‌టికే సుప్రీం కోర్టు జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఇప్పుడు ఆయ‌న జ‌డ్జి అయ్యార‌ని.. జ‌డ్జి ప‌ద‌వి వార‌స‌త్వం మారడం కాదా ఇది ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ విష‌యంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు అంటూ బీజేపీ విమ‌ర్శ‌లు సంధిస్తూ ఉంటుంద‌ని, మ‌రి జ‌డ్జిల నియామ‌కంలో ఇదంతా ఏమిటి? అంటూ రాజ్య‌స‌భ సాక్షిగా ఈ ఎంపీ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అలాగే జ‌డ్జిల నియామ‌కంలో డైవ‌ర్సిటీ కూడా లేద‌ని మ‌రో ఘాటు వ్యాఖ్య చేశారు ఈ ఎంపీ. ఇప్ప‌టి వ‌ర‌కూ సుప్రీం కోర్టు జ‌డ్జిలుగా నియ‌మితం అయిన వారిలో బ్ర‌హ్మ‌ణుల శాతం చాలా ఎక్కువ అని అన్నారు. అందుకు సంబంధించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన లెక్క‌లు చెప్పారు. త‌ను ఒక కులాన్ని వ్య‌తిరేకించ‌డం లేద‌ని, అయితే ఒకే కులస్తులు ఎక్కువ శాతంగా సుప్రీం కోర్టు జ‌డ్జి ప‌ద‌వులు చేప‌ట్ట‌డంలో కిటుకు ఏమిట‌న్న‌ట్టుగా ఈ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎంపీలు త‌ప్పు ప‌ట్టారు. 

త‌ను ఏ కులానికీ వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం లేద‌ని, అంటూ న్యాయ‌మూర్తుల ఎంపిక తీరును మాత్రం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఈ ఎంపీ. మ‌రి రాజ్య‌స‌భ సాక్షిగా ఒక ఎంపీ న్యాయ‌మూర్తుల ఎంపిక తీరునే త‌ప్పు ప‌ట్టారు, ప్రపంచంలో ఎక్క‌డా ఈ త‌ర‌హా ప‌ద్ధ‌తి లేద‌న్నారు. ఈ ప్ర‌సంగాన్ని దేశ ఉప రాష్ట్ర‌ప‌తి మెచ్చుకున్నారు. అంతా బాగుంది, మ‌రి … మార్పుకు నాంది ఉంటుందా?