పెద్దాయ‌న‌కు కోపం వ‌చ్చిందే!

ఉత్త‌రాంధ్ర పెద్దాయ‌న‌, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు కోపం వ‌చ్చింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయ పున‌ర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. అశోక్ గ‌జ‌ప‌తిరాజు,…

ఉత్త‌రాంధ్ర పెద్దాయ‌న‌, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు కోపం వ‌చ్చింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయ పున‌ర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. అశోక్ గ‌జ‌ప‌తిరాజు, ప్ర‌భుత్వ అధికారుల మ‌ధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.  

శంకుస్థాపన విషయ‌మై ధర్మకర్తల మండలితో చర్చించకుండా ప్ర‌భుత్వం ఒంటెత్తు పోక‌డ‌లు పోతోంద‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు మండిప‌డ్డారు. అశోక్‌ గజపతిరాజు ఆ ఆలయ ధర్మకర్తగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న తీవ్ర దుమారం రేపింది.  

ఆల‌యాన్ని పున‌ర్నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా రూ.3కోట్ల వ్యయంతో పున‌ర్నిర్మించేందుకు, ఇవాళ శంకుస్థాప‌న‌కు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవాదాయ అధికారులు హాజ‌ర‌య్యారు.

ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త అయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు అక్క‌డికి వెళ్లారు. క‌నీసం త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్టు ప్ర‌భుత్వం వ్య‌హ‌రిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పునర్నిర్మాణ, శంకుస్థాపన ఫలకాలను తొల‌గించేందుకు అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్ర‌య‌త్నించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు ఆయ‌న్ను అడ్డుకునేందుకు య‌త్నించారు. దీంతో అశోక్‌, అధికారుల మ‌ధ్య స్వ‌ల్ప తోపులాట జ‌రిగి ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.