వైవిధ్య భరిత సినిమాలతో కెరీర్ ను సాగిస్తున్న తమిళ నటుడు ధనుష్ తన డ్రీమ్ ప్రాజెక్టుల గురించి స్పందించాడు. అవి బయోపిక్ లు కావడం గమనార్హం. వాటిల్లో తనే ప్రధాన పాత్రను చేయాలని కూడా ఉందని ధనుష్ అంటున్నాడు. అందులో ముందు వరసలో ఉన్నది సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కావడం గమనార్హం!
రజనీకాంత్ బయోపిక్ లో ఆయన పాత్రను పండించాలని ఉందంటున్నాడు ధనుష్. తనకు పిల్లనిచ్చిన మామ కూడా అయిన రజనీకాంత్ బయోపిక్ ను ఇలా తన డ్రీమ్ ప్రాజెక్టుగా ధనుష్ చెప్పాడు. మరి రజనీ జీవితంలో కావాల్సిన స్పైసీ నెస్ ఉంది.
బస్ కండక్టర్ స్థాయి నుంచి రజనీకాంత్ సినిమా హీరోగా మారడం అందులోని కీలక ఘట్టం కాగలదు. అలాగే కెరీర్ పరంగా ఎత్తుపల్లాలు, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని సొంతం చేసుకోవడం వంటి అంశాలు కూడా రజనీ బయోపిక్ లో హైలెట్స్ అవుతాయి. ఫ్యాన్స్ లో అపరిమితమైన క్రేజ్ ను కలిగి ఉన్న రజనీకాంత్ బయోపిక్ వస్తే అది వారికి పండగే అవుతుంది.
ఇక ధనుష్ కు మరో బయోపిక్ ఆసక్తి కూడా ఉందట. అది ఇళయరాజాది కావడం గమనార్హం. ఇళయరాజా బయోపిక్ రూపొందితే అందులో తను ఆయన పాత్రను చేస్తానంటున్నాడు ధనుష్. ఇవి రెండూ తనకు ఎంతో ఆసక్తి ఉన్న బయోపిక్స్ అని రజనీకాంత్ అల్లుడు చెప్పాడు. మరి రెండింటిలోనూ బయోపిక్ లకు కావాల్సిన సరంజామా అయితే ఉంది. మరి తమిళ దర్శక, నిర్మాతలకు ధనుష్ మంచి స్టోరీ ఐడియాలనే ఇచ్చాడు. ఇవి కార్యరూపం దాలుస్తాయేమో చూడాలి!