అంత మాట ఎట్లా అంటారు?..క్ష‌మాప‌ణ చెప్పండి!

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల‌పై పీయూష్ గోయ‌ల్ నోరు పారేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పీయూష్ గోయ‌ల్ మాట‌ల్ని ప‌ట్టుకుని…

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల‌పై పీయూష్ గోయ‌ల్ నోరు పారేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పీయూష్ గోయ‌ల్ మాట‌ల్ని ప‌ట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు బీజేపీని టీఆర్ఎస్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసే ప్ర‌య‌త్నం చేస్తోంది.

వ‌డ్లు కొనుగోలు అంశంతో పాటు రైతుల స‌మ‌స్య‌ల్ని కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారు. అయితే వారినుద్దేశించి పీయూష్ గోయ‌ల్ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

‘తెలంగాణ మంత్రుల‌ను నేనేమీ ఆహ్వానించ‌లేదు. శ‌ని, ఆదివారాల్లో నేను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ముంబ‌య్‌ల‌లో ఉన్నాను. మేమంతా మా ప‌నుల్లో బిజీగా ఉన్నాం. వారెలా అంత ఖాళీగా ఉన్నారో తెలియ‌డం లేదు. వారికి చేయ‌డానికి ఏం ప‌నిలేదా? ప్ర‌జ‌ల‌కు సేవ చేసే ఉద్దేశం వారిలో క‌నిపించడం లేదు’ అని గోయ‌ల్ తీవ్ర స్వ‌రంలో అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్య‌ల‌పై ఇవాళ తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

‘పీయూష్‌ గోయల్‌ మంత్రులను ‘మీకేం పని లేదా’ అని చేసిన వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడమే. 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. పీయూష్‌ గోయల్‌ తక్షణమే త‌న వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ కోసం. మా పుట్టుక తెలంగాణ జాతి ప్రయోజనాల కోసం. 

రైతుల ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానించే హక్కు పీయూష్ గోయల్‌కి ఎక్కడిది? మూడు రోజుల పాటు మంత్రులు కలిసేందుకు ప్రయత్నిస్తే సమయం లేదన్నారు. స్థానిక బీజేపీ నేతలను కలిసేందుకు సమయం ఉందా? మా ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత రాజకీయం. ఇంత అవహేళనగా మాట్లాడటం సరికాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు దీనిపై ఏమంటారు? బీజేపీకి రైతుల ఓట్లు కావాలి కాని వడ్లు అక్కర్లేదు’  అని హరీశ్‌ విమర్శించారు. 

కేంద్ర మంత్రి వ్యాఖ్య‌లు ఆ పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ చేతికి ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. అంత మాట ఎట్లా అంటారు? క్ష‌మాప‌ణ చెప్పాల‌నే డిమాండ్‌పై టీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయం చేస్తోంది.