విజిల్ సినిమాతో తమిళ సూపర్ స్టార్ విజయ్ మార్కెట్ మీద మళ్లీ బయ్యర్ల కన్ను పడింది. దీనికి తోడు విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాకు దర్శకుడు లోకేష్. ఇతగాడి మీద కూడా మంచి అంచనాలు వున్నాయి. ఇటీవల వచ్చిన కార్తీ ఖైదీకి లోకేష్ నే దర్శకుడు.
సో, విజయ్-లోకేష్ కాంబినేషన్ అంటే తెలుగునాట కూడా బయ్యర్లకు మాంచి అంచనాలు వచ్చి, పోటీ పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆ సినిమాను 8.75 కోట్లకు తెలుగు హక్కులు తీసుకున్నారు నిర్మాత మహేష్ కోనేరు. విజిల్ సినిమాను విడుదల చేయడంలో, ప్రమోట్ చేయడంలో మహేష్ కోనేరు వర్క్ నచ్చడంతో విజయ్ ఓ మాట సాయం చేసినట్లు బోగట్టా.
విజిల్ సినిమా తెలుగునాట మంచి లాభాలు తెచ్చింది. మహేష్ కోనేరు బ్యానర్ ఈస్ట్ కోస్ట్ సంస్థకు 2019లో అటు 118, ఇటు విజిల్ మంచి లాభాలు ఇచ్చాయి. విజయ్-లోకేష్ ల సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు. మాళవిక మోహనన్ కథనాయిక. ఈ సినిమా టైటిల్ ను సంక్రాంతికి అనౌన్స్ చేస్తారు. సినిమా ప్రీ సమ్మర్ టైమ్ లో విడుదలవుతుంది.