మన్యంలో పారిశ్రామిక కాంతులు

ఉత్తరాంధ్రాలో కొత్త జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు అయింది. పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు అన్న నాలుగు అసెంబ్లీ సీట్లతో ఈ జిల్లాను రూపొందించారు. ఈ జిల్లాలో ఉన్న పదిహేను మండలాలలో గిరిజన…

ఉత్తరాంధ్రాలో కొత్త జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు అయింది. పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు అన్న నాలుగు అసెంబ్లీ సీట్లతో ఈ జిల్లాను రూపొందించారు. ఈ జిల్లాలో ఉన్న పదిహేను మండలాలలో గిరిజన జనాభా అత్యధికం. గిరిపుత్రుల జిల్లాగా పేరు మోసింది.

మన్యం జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉంది. అటవీ ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ. ఏపీ ఒడిషా మధ్య ఉన్న కొటియా గ్రామాలలో అత్యధిక శాతం ఖనిజ సంపద కుప్పపోసి ఉంది. ఇందులో మాంగనీస్, బాక్సైట్, గ్రానైట్ వంటి ఖనిజాలు లభ్యం అవుతున్నాయి.

ఉత్పత్తుల విషయానికి తీసుకుంటే చింతపండు ఎక్కువగా పండుతుంది. జీడి పిక్కల ఉత్పత్తిలో మన్యం జిల్లా ముందు వరసలో ఉంది. మన్యం జిల్లా అన్ని విధాలుగా వెనకబడి ఉంది. పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

విశాఖలో జరిగిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడంతో మన్యం జిల్లాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. ఒప్పందాలు జరిగిన వాటిలో ఖనిజ సంపద ఆధారితమైన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులు కూడా ఉన్నారని అంటున్నారు.

అదే కనుక జరిగితే కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లా దశ తిరగడం ఖాయమని అంటున్నారు. మన్యం జిల్లాలో పారిశామిక కాంతులు ప్రసరిస్తే గత ఏడున్నర దశాబ్దాల వెనకబాటుతనం పోయి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. ఆ దిశగా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా మంత్రి రాజన్న దొర కృషి చేస్తున్నారని చెబుతున్నారు. 

ఉత్తరాంధ్రాలోని ఆరు జిల్లాలలో సమగ్రమైన ప్రగతి జరిగేందుకు వీలుగా అవకాశం ఉన్న చోట పరిశ్రమలు ఏర్పాటు చేయలని మేధావులు ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు అధికారులు పారిశ్రామికవేత్తలను నడిపించాలని సూచిస్తున్నారు.