కొత్త హీరోలు తమ సినిమాల్ని రిలీజ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. ఎలాంటి పోటీ లేకుండా జాగ్రత్త పడతారు. అలా సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని చూసుకుంటారు. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చే హీరోలైతే ఈ విషయంలో మరో రెండు అడుగులు ముందుంటారు. అవసరమైతే మిగతా సినిమాల్ని పక్కకు జరిపి తమ నటవారసుడి సినిమాకు సోలో రిలీజ్ వచ్చేలా చూసుకుంటారు.
కానీ అదేంటో, దగ్గుబాటి అభిరామ్ సినిమాకు మాత్రం ఇలాంటి వ్యవహారం ఏదీ జరుగుతున్నట్టు కనిపించడం లేదు. సోలో రిలీజ్ సంగతి దేవుడెరుగు, మంచి పోటీ వాతావరణంలో ఇతగాడి మొదటి సినిమా విడుదలకు సిద్ధమవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
తేజ దర్శకత్వం వహించిన అహింస సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు దగ్గుబాటి అభిరామ్. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆ రోజున రవితేజ నటించిన రావణాసుర రిలీజ్ అవుతుంది. తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ అనే సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అండతో భారీగా రిలీజ్ అవుతోంది మీటర్ సినిమా.
ఇలా 2 సినిమాలు బరిలో ఉండగా, డెబ్యూ హీరో నటించిన అహింస సినిమాను అదే తేదీకి విడుదల చేయాలనుకోవడం సాహసమనే చెప్పాలి. పోనీ ఈ రెండు సినిమాల్ని సైడ్ చేయాలని చూసినా ఫలితం లేదు. ఎందుకంటే, 7వ తేదీకి ముందు దసరా సినిమా ఉంది. 7వ తేదీ తర్వాత శాకుంతలం ఉంది.
ఇప్పటికే అహింసపై బజ్ అంతంతమాత్రంగా ఉంది. దీనికితోడు బాక్సాఫీస్ బరిలో ఎటు చూసినా పోటీ. ఇలాంటి పరిస్థితుల్లో అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న అహింస సినిమాను విడుదల చేయాలనుకోవడం ఏం ప్లానింగో నిర్మాతలకే తెలియాలి.