ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. సొంత పార్టీ బీఆర్ఎస్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమని ప్రకటించడం గమనార్హం. బీజేపీలో చేరుతారని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే అందుకు విరుద్ధంగా సొంత పార్టీ స్థాపనపై పొంగులేటి ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఎక్కడికక్కడ రానున్న ఎన్నికల్లో తన వాళ్లు నిలబడుతారంటూ పొంగులేటి ప్రకటిస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం పాలేరులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో సమయం వచ్చినప్పుడు చెబుతానని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదన్నారు. రాబోయే ప్రభంజనంలో మీరంతా కొట్టుకుపోతారని బీఆర్ఎస్ నేతల్ని హెచ్చరించడం గమనార్హం.
జెండా ఏదైనా సరే, ఎజెండా మాత్రం ఒక్కటే అని తేల్చి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ఎజెండాగా ఆయన ప్రకటించారు. తన ప్రాణం ఉన్నంత వరకూ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో పొంగులేటి సొంత పార్టీ పెట్టుకుని రాణించగలరా? అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తమ పార్టీలోకి పొంగులేటి వస్తారని, తద్వారా ఖమ్మం జిల్లాలో బలపడొచ్చని బీజేపీ నేతలు ఆశించారు. అయితే ఇటు బీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తూ, మరోవైపు తమ వైపు మొగ్గు చూపకుండా, తనదైన సొంత మార్గంలో పయనించడం బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది.
ఆర్థికంగా బలవంతుడైన పొంగులేటి బీజేపీలో చేరి వుంటే, ఆ పార్టీకి ఎంతో ప్లస్ అయ్యేదనడంలో సందేహం లేదు. కానీ బీజేపీ వైపు ఆసక్తి చూపకపోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా వుందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది. తన డిమాండ్లను బీజేపీ పరిగణలోకి తీసుకోలేక పోవడం వల్లే పొంగులేటి గుర్రుగా ఉన్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.