కన్నడ సినిమా రంగం కేజిఎఫ్ హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేకపోతున్నట్లు కనిపిస్తోంది. భారీ భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. టీజర్లు వస్తున్నాయి. కానీ వాటిని చూస్తుంటే మాత్రం కేజిఎఫ్ గుర్తుకు రాకుండా వుండడం లేదు.
కథ, కథనాలు వేరు కావచ్చు. కానీ పిక్చరైజేషన్, కలర్ స్కీమ్, నటీనటుల డిఫెరెంట్ గెటప్ లు ఇవన్నీ కలిసి కేజిఎఫ్ దిశగానే దారి తీసున్నాయి. మొన్నటికి మొన్న మార్టిన్ ట్రయిలర్ వచ్చింది. ఇప్పుడు కబ్జా ట్రయిలర్ వచ్చింది. రెండూ అదే తీరు.
ఉపేంద్ర నటిస్తున్న కబ్జా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో తయారయినట్లు కనిపిస్తోంది. చాలా అంటే చాలా భారీ కథ, లెక్కకు మించిన పాత్రలు, దానికి తగిన నటులు, భారీ సెట్ లు, ఇలా ఒక రేంజ్ లో వుంది ట్రయిలర్. కానీ కథ దిశ, దశ ఏమిటన్నది మాత్రం ట్రయిలర్ లో చూపించలేదు. అయితే కలర్ స్కీమ్, చిత్రీకరణ అంతా పదే పదే కెజిఎఫ్ నే గుర్తుకు తెచ్చింది.
సాంకేతికంగా బలమైన సినిమాగా అనిపిస్తోంది. ట్రయిలర్ లో కనిపించిన స్టార్ కాస్ట్ చాలా పొడవు వుంది. కిచ్చా సుదీప, ఉపేంద్ర దగ్గర నుంచి మొదలవుతాయి పేర్లు. డాక్టర్ శివరాజ్ కుమార్, శ్రియ, మురళీశర్మ, పోసాని, దేవ్ గిల్, కోటా, ఇక బాలీవుడ్ నటులు ఇలా చాలా మందే వున్నారు.
మనకు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే సినిమా అందించిన చంద్రు ఈ సినిమా దర్శకుడు. రవి బసూర్ సంగీత దర్శకుడు.