‘కాకి ముట్టుడు’ కాపీ కాదు.. మన సంప్రదాయం

నటుడు, కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తీసిన సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఎలా ఆడుతుందనే విషయం పక్కనపెడితే, ఈ సినిమాపై చెలరేగిన…

నటుడు, కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తీసిన సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఎలా ఆడుతుందనే విషయం పక్కనపెడితే, ఈ సినిమాపై చెలరేగిన వివాదం మాత్రం నలుగుర్నీ ఆకర్షించింది.

బలగం కథ నాదేనంటూ సతీష్ అనే జర్నలిస్ట్ తెరపైకొచ్చాడు. 2014లో ఓ పత్రికలో తను రాసిన పచ్చిక అనే కథ ప్రచురితమైందని, అదే కథను కాపీ కొట్టి బలగం తీశారని ఆరోపించాడు. ఈ ఆరోపల్ని దర్శకుడు వేణు తిప్పికొట్టాడు. కాకి ముట్టుడు అనేది తెలుగు సంప్రదాయమని, దాన్ని కాపీ కొట్టడం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాడు.

“పచ్చిక అనే కథ నేను చదవలేదు. బలగం సినిమా కథ తనది అంటున్నాడు. తెలుగువాళ్ల సంప్రదాయంపై తీసిన సినిమా బలగం. అది నాది అనడం కరెక్ట్ కాదు. పిట్ట ముట్టుడు, చావు, ఆ సందర్భంగా వచ్చిన సెటప్ మొత్తం తెలుగు సంప్రదాయం. ఇది ఒకరి సొత్తు కాదు. మన సంప్రదాయాలపై ఎవరు ఎలాగైనా స్పందించొచ్చు. దాన్ని కాపీ అనడం కరెక్ట్ కాదు.”

చావుపై 2000లో బెంగాల్ లో ఓ సినిమా, 90ల్లో మరాఠీలో ఓ సినిమా, తిధి అనే సినిమా,కొరియన్ లో కూడా ఓ సినిమా వచ్చిందని అంటున్న వేణు, అవన్నీ కాపీ కథలా అని ప్రశ్నించాడు. తెలుగు సంప్రదాయంపై సినిమా తీసినప్పుడు కాపీ కొట్టామని ఆరోపించడం కరెక్ట్ కాదంటున్నాడు.

“ఈ పిట్ట ముట్టుడు కాన్సెప్ట్ పై ఎవరైనా సినిమా తీయొచ్చు. బలగం కథ నాది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో మాట్లాడండి. దిల్ రాజు గారికి సంబంధం లేదు. ఆయన కోర్టుకు వెళ్తానంటున్నాడు. ఆయన కంటే ముందు నేను కోర్టుకు వెళ్తాను.”

తన ఆరేళ్ల కష్టాన్ని ఇలా కాపీ అంటూ విమర్శిస్తే ఊరుకోనని వేణు హెచ్చరించాడు. తను ఎంత కష్టపడ్డానో, ఈ కథపై ఎంత వర్క్ చేశానో యూనిట్ లో అందరికీ తెలుసంటున్నాడు. అయినా పత్రికలో వచ్చిన ఒకటిన్నర పేజీ కథకు, సినిమాగా వచ్చిన వంద పేజీల కథకు ఎలా పోలిక పెడతారని ప్రశ్నిస్తున్నాడు.