ఒకప్పుడు తమన్ పై ఉన్న రిమాక్క్ ఇది. తన ట్యూన్స్ ను తనే కాపీ కొట్టేస్తుంటాడని, పాటల్లో అస్సలు కొత్తదనం ఉండదనే విమర్శలు అప్పట్లో ఎక్కువగా వినిపించేవి. వాటిని ఒప్పుకున్నాడు తమన్. ఒక దశలో తనపై భారీ ఎత్తున ట్రోలింగ్ నడిచిందని అందుకే గ్యాప్ తీసుకున్నానని కూడా ప్రకటించాడు.
“స్క్రిప్ట్ కు తగ్గట్టే పాటలు ఉంటాయి. కథకు తగ్గట్టే పాటలొస్తాయి. సందర్భాలు రొటీన్ గా ఉంటే పాటలు కూడా రిపీట్ అవుతుంటాయి. నా తప్పుల్ని నేను ఒప్పుకుంటున్నాను. బిజినెస్ మేన్ లో పిల్లా చావ్ సాంగ్ నుంచి నాపై ట్రోలింగ్ మొదలైంది. దూకుడు తర్వాత టాప్ పొజిషన్ లో కూర్చున్న నన్ను ఆ పాట కాపీ క్యాట్ అంటూ కిందకు లాగింది.”
నిజానికి పిల్లా చావ్ సాంగ్ ను తను కంపోజ్ చేయలేదంటున్నాడు తమన్. దర్శకుడు పూరి జగన్నాద్ తనకు ఆ ట్యూన్ వినిపించాడని, యాజ్ ఇటీజ్ గా కావాలని అడగడంతో ఇచ్చానంటున్నాడు. ట్రోలింగ్ తర్వాత గ్యాప్ అనివార్యమైందని, ఆ గ్యాప్ లో నో చెప్పడం నేర్చుకున్నానని అంటున్నాడు తమన్.
“సరైనోడు తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నాను. నా తప్పులు తెలుసుకున్నాను. తప్పు నా పాటల్లో లేవు. నేను ఎంచుకున్న స్క్రిప్ట్స్ లో ఉందని గ్రహించాను. అందుకే స్టీరియోటైపు స్క్రిప్టులు తీసుకోవడం మానేశాను. కొంతమంది దర్శకులకు ఎలా నో చెప్పాలో నేర్చుకున్నాను. మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ, అరవింద సమేత సినిమాలు నన్ను రైట్ ట్రాక్ లోకి తీసుకొచ్చాయి.“
ఏదో ఒక చోట సెటిల్ అవ్వడం తనకు ఇష్టం లేదంటున్నాడు తమన్. ట్రావెలింగ్ చేయడం తనకు ఇష్టమని, అందుకే ముంబయి, హైదరాబాద్, చెన్నై మధ్య తిరుగుతుంటానంటున్నాడు. ఇప్పుడు కొత్తగా భీమిలిలో కూడా ఓ చిన్న స్టుడియో సెటప్ పెట్టుకున్నానని, ఇకపై భీమిలి కూడా వెళ్తుంటానని తెలిపాడు. సూపర్ హిట్ సాంగ్స్ తో దూసుకుపోతున్న ఈ కంపోజర్, ఇకపై తననుంచి రిపీట్ ట్యూన్స్ రావని హామీ ఇస్తున్నాడు.