నిర్ణయం వాయిదా వెనక అసలు కారణాలివే!

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించడాన్ని ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు  ముఖ్యమంత్రి జగన్. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ప్రకటన చేయాల్సిన సీఏం, ఆ నిర్ణయాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. ప్రతిపక్షాలు…

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించడాన్ని ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు  ముఖ్యమంత్రి జగన్. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ప్రకటన చేయాల్సిన సీఏం, ఆ నిర్ణయాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయనో లేక అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తున్నారనో జగన్ ఈ నిర్ణయం తీసుకోలేదు. దీని వెనక సహేతుకమైన కారణాలున్నాయి.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచి సంచనల నిర్ణయాలు తీసుకుంటూ, వాటిని శరవేగంగా అమలు చేస్తున్న జగన్.. 3 రాజధానుల అంశంపై మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుపడకుండా ఉండేందుకు మాత్రమే జగన్ ఇలా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఒక్కసారి ఈ వ్యవహారం కోర్టు పరిథిలోకి వెళ్లిందంటే, ఇక అక్కడ్నుంచి ఎంత జాప్యం జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. అందుకే కోర్టు వరకు వెళ్లకుండా ఉండేందుకు కాస్త వెనక్కి తగ్గారు సీఎం.

మరి విషయం కోర్టు వరకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? చంద్రబాబు ఈ విషయంపై నోరు మెదపకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి జగన్ వద్ద తిరుగులేని ప్లాన్ ఉంది. అదే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచడం. అవును.. ఒక్కసారి అసెంబ్లీలో తీర్మానం జరిగిందంటే ఇక కోర్టులు కూడా దాన్ని దాన్ని ఆపలేవు. ఇక అక్కడ్నుంచి వ్యవహారం సజావుగా సాగిపోతుంది. 3 రాజధానుల విషయంలో జగన్ వెనక్కి తగ్గడానికి ఇదే ప్రధాన కారణం.

జీఎన్ రావు కమిటీ నివేదిక రాకముందే 3 రాజధానుల అంశంపై అసెంబ్లీలో జగన్ ప్రకటన చేశారు. ఇలా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. కమిటీ నివేదిక రాకముందే ఎలా ప్రకటిస్తారంటూ ఆక్షేపించాయి. ఇప్పుడు దానికి సంబంధించి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చే సాంకేతిక నివేదిక ఇంకా పెండింగ్ లోనే ఉంది. అది జనవరి 3వ తేదీన ప్రభుత్వానికి అందుతుంది. సో.. ఇలాంటి సమయంలో కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే, మరోసారి విమర్శలు వస్తాయని, కోర్టు కేసులు పడతాయని జగన్ భావించారు. అందుకే కొంచెం వెనక్కి తగ్గారు.

సాంకేతిక నివేదిక వచ్చిన వెంటనే 8వ తేదీన కేబినెట్ భేటీ ఉంటుంది. అప్పుడు 3 రాజధానుల అంశంపై ఓ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే బాగుంటుందనేది జగన్ ఆలోచన. ఆ తర్వాత అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి ప్రతిపాదనను ఆమోదింపజేయడం, లేదంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేసి తీర్మానం చేయడం చేస్తారు. ఈ రెండింటిలో ఏది చేసినా ఇక ఆ నిర్ణయానికి ఎదురుండదు. కోర్టులు కలగజేసుకోవు.

సో.. ఈ గ్యాప్ లో జీఎన్ రావు కమిటీ నివేదికను, బోస్టన్ సాంకేతిక నివేదికను అధ్యయనం చేసేందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి. దీన్ని కూడా వ్యూహాత్మక ఎత్తుగడగానే చెబున్నారు రాజకీయ నిపుణులు. అయితే ఈ ప్రణాళికలు, వ్యూహాలన్నీ వచ్చేనెల 10-11 తేదీల్లోపు పూర్తయిపోవాలి. ఎందుకంటే, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే, ఇక ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం కుదరదు.

సో.. జనవరి 10లోపు విశాఖ కేపిటల్ అంశంపై ఓ స్పష్టత రావడం ఖాయం.  కాబట్టి నిన్నటి కేబినెట్ మీటింగ్ లో 3 రాజధానుల అంశంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అనుకోవడం చంద్రబాబు భ్రమే అవుతుంది తప్ప, నిజం కాదు. అక్కడున్నది జగన్. అనుకున్నది ఆటోమేటిగ్గా జరిగిపోవాల్సిందే.

జగన్ చేతితో కేపిటల్ పైనల్ రిపోర్ట్