'అమరావతి భూ అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకోండి..' అంటూ ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రకటిస్తూ ఉన్నారు. మొదటేమో అక్రమాలే లేవు అని తెలుగుదేశం పార్టీ వాళ్లు వాదిస్తూ వచ్చారు. అయితే మూడు రాజధానుల ఫార్ములాను సీఎం వైఎస్ జగన్ ప్రకటించాకా… తెలుగుదేశం పార్టీ కొత్త పల్లవి అందుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే చర్యలు తీసుకోండి అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు జగన్ ప్రభుత్వానికి.
అందుకు సమయం ఆసన్నమవుతున్నట్టుగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో కేబినెట్ సబ్ కమిటీని ఒకదాన్ని వేశారు జగన్ మోహన్ రెడ్డి. కొన్ని నెలల కిందటే ఆ కమిటీ పని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ కమిటీ నివేదికను కూడా ముఖ్యమంత్రికి ఇచ్చింది. ఈ విషయం జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది.
రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించే ముందుగా.. తెలుగుదేశం నేతలు భూములను స్థానికుల నుంచి కొనుగోలు చేశారని, అలా తెలుగుదేశం పార్టీ వాళ్ల కొనుగోళ్లు పూర్తయ్యేకే.. రాజధాని ప్రకటన వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో మొదలుపెడితే, రాయలసీమ నేతల వరకూ అంతా ఆ స్కామ్ లో భాగస్వామ్యులే అని, భారీ ఎత్తున వారంతా భూములు కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు అమరావతిపై టీడీపీ నేతలు ప్రాంతాలకు అతీతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి.
ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ మొత్తం వివరాలను, ఎవరెవరు ఎంత భూమి కొనుగోలు చేశారు, బినామీ కథలేంటి.. అనే వివరాలను పొందు పరిచి సీఎంకు నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లీగల్ ప్రొసీడింగ్స్ కు జగన్ ప్రభుత్వం రెడీ అవుతోందని సమాచారం. ఇది చంద్రబాబు నాయుడు అండ్ కమిటీకి గట్టి ఎదురుదెబ్బ కాబోతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.