జర్నలిస్ట్ లపై దాడి.. సమర్థించిన చంద్రబాబు

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు బహుశా తొలిసారి జర్నలిస్ట్ లపై జరిగిన దాడిని సమర్థించి ఉంటారేమో అనిపిస్తోంది. అవును, సాక్షి మినహా మిగతా పత్రికలు, ఛానెళ్ల విలేకరులను ఎప్పుడూ వెనకేసుకొచ్చే చంద్రబాబు, అమరావతిలో…

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు బహుశా తొలిసారి జర్నలిస్ట్ లపై జరిగిన దాడిని సమర్థించి ఉంటారేమో అనిపిస్తోంది. అవును, సాక్షి మినహా మిగతా పత్రికలు, ఛానెళ్ల విలేకరులను ఎప్పుడూ వెనకేసుకొచ్చే చంద్రబాబు, అమరావతిలో టీవీ ఛానెళ్ల విలేకరులపై జరిగిన దాడిపై చిత్రంగా స్పందించారు. మీడియా ముసుగులో మీ సొంత అజెండాల కోసం పనిచేయొద్దని హెచ్చరించారు.

అమరావతి ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులున్నారంటూ రైతుల్ని అవమానిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారని, వైసీపీని పైకి లేపడానికి పనిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మీడియాపై జరిగిన దాడిని ఖండించకుండా, చంద్రబాబు ఇలా ఓ సెక్షన్ మీడియాపై ఫైర్ అయ్యారు.

మొత్తమ్మీద టీవీ9 జర్నలిస్ట్ పై జరిగిన దాడితో అమరావతి ఆందోళనలు మరో మలుపు తీసుకున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో రకంగా సంచలనం సృష్టించి, అందరి దృష్టినీ ఆకర్షించాలనుకున్న కొంతమంది జనాలు.. మహిళా జర్నలిస్ట్ పై దాడి చేసి, కారు కూడా ధ్వంసం చేశారు. సదరు జర్నలిస్ట్ ను పరుగెత్తించి మరీ కొట్టారు. అయితే ఈ దాడి ఘటనను చాలాసేపటి వరకు టీవీ9 ఎందుకో హైలెట్ చేసుకోలేదు. 

సహజంగా ఎవరిపైనైనా దాడి జరిగితే.. పదే పదే దాన్ని రిపీట్ చేసి చూపించే మెరుగైన సమాజం, ఈ దాడి వీడియోని బైటకు రానివ్వలేదు. కనీసం సింపతీ కోసమైనా ఆ విజువల్ ని చూపించుకోలేదు. రాత్రికి తీరిగ్గా బాస్ రజనీకాంత్ లైన్లోకి వచ్చి తమపై దాడి చేస్తే భయపడి వెనక్కి తగ్గబోమని, జర్నలిస్ట్ లకు యాజమాన్యం అండగా ఉంటుందని రవిప్రకాష్ స్టైల్లో చెప్పాలని చూసినా… ఆ ఫ్లో రాక, పదాలు అందక, తన తడబాటు మర్చిపోలేక అలా మమ అనిపించి వెళ్లిపోయారు. రాగా పోగా ఒక్క సాక్షి మాత్రమే ఈ దాడి ఘటనకు ప్రాధాన్యతనిచ్చింది.

అమరావతిలో ఆందోళన చేస్తున్న వాళ్లంతా నిజమైన రైతులే కావొచ్చు, పెయిడ్ ఆర్టిస్ట్ లు లేకపోనూవచ్చు. అంత మాత్రాన విలేకరులపై దాడి చేయడం సమంజసమేనా? టీవీ ఛానెళ్లలో తప్పుడు వార్తలు ఇచ్చినంత మాత్రాన అసలు సమస్య పక్కదారి పడుతుందా? అన్యాయం జరుగుతుందా? ఏది ఏమయినా అమరావతిలో విలేకరులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. చంద్రబాబు సమర్థించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.