పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రెండో హిందూ ఆటగాడు అయిన దానిష్ కనేరియా పట్ల ఇండియాలో సానుభూతి వ్యక్తం అవుతూ ఉంది. పాకిస్తాన్ తరఫున 60కి పైగా టెస్టులు ఆడి 260కి పైగా వికెట్లు తీశాడు ఈ స్పిన్నర్. అన్ని టెస్టులకు ప్రాతినిధ్యం వహించడం అంటే మాటలు కాదు. ఇంజమామ్ కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్ లు ఆడాడు కనేరియా. పాక్ జాతీయ జట్టుకు ఒక హిందువు ప్రాతినిధ్యం వహించడమే ఒక పెద్ద ఆశ్చర్యం.
అయితే జాతీయ జట్టులో సహచర ఆటగాళ్లు కనేరియాను బాగా అవమానించారనే విషయం ఇటీవల బయటకు వచ్చింది. అప్పటి పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఈ విషయాన్ని బయట పెట్టాడు. కేవలం హిందూ అనే కారణం చేత కనేరియాను వెలివేసినట్టుగా మిగతా ఆటగాళ్లు వ్యవహరించే వారని అసలు విషయాన్ని అక్తర్ ప్రకటించాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయం బయట పెట్టడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అక్తర్ బయటపెట్టిన ఈ విషయంపై కనేరియా స్పందించాడు. తనకు మద్దతు పలికిన ఆ క్రికెటర్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కనేరియా. మరి కొందరు ఆటగాళ్లు కూడా అప్పట్లో తనకు మద్దతుగా నిలిచారని, కొందరు మాత్రం అనుచితంగా ప్రవర్తించినట్టుగా ఈ పాక్ మాజీ క్రికెటర్ చెప్పాడు. అయితే ఆ విషయాలన్నింటి మీదా మాట్లాడే ధైర్యం ఇప్పటికీ తనకు లేదని కనేరియా చెప్పాడు.
పాకిస్తాన్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత కనేరియా ఇంగ్లండ్ వెళ్లి కౌంటీలు, క్లబ్ లకు ఆడుకుంటున్నాడు. అయితే అక్కడ ఫిక్సింగ్ వివాదంలో కనేరియా చిక్కుకున్నాడు. తనకు పాక్ నుంచి సపోర్ట్ కావాలని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుకూడా సహాయం అర్థించాడు కనేరియా. మరోవైపు ఇండియాలో సీఏఏ పై చర్చ జరుగుతున్న వేళ కనేరియా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పాక్ నుంచి వచ్చే హిందువులకు భారత పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తోంది సీఏఏ చట్టం. ఈ నేపథ్యంలో కనేరియా కోరుకుంటే అతడికి భారత పౌరసత్వం ఇస్తామని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు.