మై హోమ్ ను పూర్తిగా సొంతం చేసుకుంటున్న జూప‌ల్లి!

మై హోమ్ రామేశ్వ‌ర‌రావుగా ఫేమ‌స్ అయిన జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఇప్పుడు ఆ సంస్థ‌కు పూర్తి అధిప‌తిగా మార‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మై హోమ్ ఇండ‌స్ట్రీస్ లో జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుకు సంబంధించిన సంస్థ‌ల వాటా…

మై హోమ్ రామేశ్వ‌ర‌రావుగా ఫేమ‌స్ అయిన జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఇప్పుడు ఆ సంస్థ‌కు పూర్తి అధిప‌తిగా మార‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ మై హోమ్ ఇండ‌స్ట్రీస్ లో జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుకు సంబంధించిన సంస్థ‌ల వాటా యాభై శాతం వ‌ర‌కూ ఉండ‌గా.. ఇప్పుడు వంద శాతం వాటాను జూప‌ల్లి సంస్థ‌లు సొంతం చేసుకోనున్నాయ‌ట‌. దీంతో మై హోమ్ ఇండ‌స్ట్రీ పూర్తిగా జూప‌ల్లి సొంతం కానుంది.

ఇన్నాళ్లూ మై హోమ్ ఇండ‌స్ట్రీస్ లో ఐర్లాండ్ సంస్థ సీఆర్ హెచ్ కు యాభై శాతం వాటాలున్నాయని స‌మాచారం.  ఆ సంస్థ‌కు సంబంధించిన వాటాల‌న్నింటినీ మై హోమ్ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్, జూప‌ల్లి రియ‌లెస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ‌లు కొనుగోలు చేశార‌ని తెలుస్తోంది. ఈ డీల్ మొత్తం విలువ వెయ్యి కోట్ల రూపాయ‌లు అని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఈ డీల్ కు సీసీఐ ఆమోద ముద్ర కూడా ప‌డింద‌ట‌. దీంతో మై హోమ్ పూర్తిగా జూప‌ల్లి చేతికి ద‌క్కనున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే మై హోమ్ గ్రూప్ ప‌లు వ్యాపార రంగాల్లో విస్త‌రించి ఉంది. మ‌హా సిమెంట్ కూడా ఈ గ్రూప్ కు సంబంధించిన‌దే.