విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లేటెస్ట్ గా సౌండ్ చేశారు. ఆయన ఈ మధ్య కాలంలో పెద్దగా రాజకీయ హడావుడి చేయడంలేదు. అయితే ఆయన తాజాగా జిల్లాలోని పాయకరావుపేటలో కాపు నేత వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ హట్ చర్చకు తావిస్తున్నాయి. కాపులదే ఏపీలో రానున్న కాలమని గంటా చెప్పడం విశేషం. అంతే కాదు, కాపులు అంతా ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని కూడా చెప్పారు.
కాపులంతా ఏకత్రాటిపైన నడవాలని ఆయన గట్టిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వంటి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలసి గంటా కొత్త సమీకరణలకు తెరతీశారు. నిజానికి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రస్తుతం ఆ పార్టీలో చురుకుగా లేరని టాక్.
మరి ఆయన ఎన్నికల వేళకు సరైన డెసిషన్ తీసుకుంటారు అన్న మాట ఉంది. అయితే ఆయన కాపుల నినాదం సడెన్ గా అందుకోవడంతో ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ కూడా వస్తోంది. మరో వైపు ఇప్పటికే ఆప్షన్ గా ఉన్న జనసేనలో ఆయన చేరుతారా అన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి గంటా లేటెస్ట్ కామెంట్స్ తో ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.