మున్నాభాయ్ ఎంబీబీఎస్.. బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. ఆ తర్వాత దానికి ధీటైన సీక్వెల్ వచ్చింది. రెండు ప్రధాన పాత్రలను కొనసాగిస్తూ.. లగేరహో మున్నాభాయ్ వచ్చింది. సంజయ్ దత్ ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి ఈ రెండు సినిమాలు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ ను సౌత్ లో కమల్, చిరంజీవి, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు రీమేక్ చేశారు. ఫర్వాలేదనిపించారు. అయితే రెండో పార్ట్ మాత్రం తెలుగులో వచ్చి, ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది.
హిందీలో మాత్రం లగేరహో మున్నాభాయ్ కూడా అద్భుతమైన సినిమాగానే నిలుస్తుంది. ఆ తర్వాత మున్నాభాయ్ సీరిస్ లో మూడో సినిమాపై రకరకాల వార్తలు వచ్చాయి. దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ మూడో పార్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా దాదాపు పుష్కర కాలం కిందటే వార్తలు వచ్చాయి. మూడో వెర్షన్ అమెరికాలో సాగుతుందని, అప్పట్లో ఒక వార్త కూడా ప్రచారం లోకి వచ్చింది.
అయితే మున్నాభాయ్ మూడో వెర్షన్ రానే లేదు. అయితే రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వంలో సంజయ్ దత్ బయోపిక్ వచ్చింది. అందులో సంజయ్ దత్ నటించకపోయినా.. అలా వారి అనుబంధం అయితే కొనసాగింది. ఇక పీకేలో కూడా సంజయ్ దత్ ఒక పాత్ర చేశాడు.
ఆ సంగతలా ఉంటే.. మున్నాభాయ్ కు మూడో పార్ట్ తీయమని తను ఇప్పటికే పలుమార్లు రాజ్ కుమార్ హీరానీని కోరినట్టుగా సంజయ్ దత్ అంటున్నాడు. కథను రెడీ చేయమని పలు సార్లు చెప్పాడట. అయితే రాజ్ కుమార్ మాత్రం లేట్ చేస్తున్నాడట. వీలైతే మున్నాభాయ్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కూడా ఆ దర్శకుడికి లేఖలు రాయాలని.. ఇంకో సీక్వెల్ ను తీయమని ఆ దర్శకుడిని కోరాలని సంజయ్ దత్ అన్నాడు.
మొత్తానికి సంజయ్ దత్ కు మరోసారి మున్నాభాయ్ అవతారం ఎత్తాలనే ముచ్చట చాలానే ఉన్నట్టుంది. మరి రాజ్ కుమార్ దే లేటు కాబోలు!