విచార‌ణ‌కు రాలేన‌న్న అవినాష్‌… రావాల్సిందేన‌న్న సీబీఐ!

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఈ నెల 6న సోమ‌వారం విచార‌ణ‌కు రావాల‌ని క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ మేర‌కు…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఈ నెల 6న సోమ‌వారం విచార‌ణ‌కు రావాల‌ని క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ మేర‌కు శ‌నివారం రాత్రి పులివెందుల‌లో అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు అంద‌జేశారు. సోమవారం విచార‌ణ‌కు రాలేన‌ని అవినాష్ వారితో చెప్పారు.

అందుకు సీబీఐ అధికారులు అంగీక‌రించలేదు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హైద‌రాబాద్‌లోని సీబీఐ కార్యాల‌యానికి విచార‌ణ నిమిత్తం రావాల్సిందే అని స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌కు అవినాష్‌రెడ్డి వెళ్లడంపై ఉత్కంఠ నెల‌కుంది. ఇదిలా వుండ‌గా ఇప్ప‌టికే రెండు ద‌ఫాలు సీబీఐ విచార‌ణ‌ను అవినాష్‌రెడ్డి ఎదుర్కొన్నారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 28, అలాగే ఫిబ్ర‌వ‌రి 24న విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి వెళ్లాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మాజీ మంత్రి వివేకా హ‌త్యలో అవినాష్‌రెడ్డి పాత్ర‌పై సీబీఐ అభిప్రాయం ఏంటో అఫిడ‌విట్‌లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. దీంతో సీబీఐ ఏదైనా కీల‌క నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ గ‌త కొంత కాలంగా న‌డుస్తోంది. 

సీబీఐ అడిగిన ప్ర‌శ్న‌లన్నింటికి స‌మాధానం ఇచ్చిన‌ట్టు అవినాష్‌రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మూడోసారి కూడా అవినాష్‌రెడ్డిని పిల‌వ‌డం వెనుక కార‌ణం ఏమై వుంటుందా? అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.