‘మూడు రాజధానులు’ రెఫరెండమా?

ఏపీలో రాజధాని మార్పు నిర్ణయంపై ప్రకటన చేయడాన్ని సీఎం జగన్‌ వాయిదా వేసినప్పటికీ ఇప్పటికైతే ఈ చిచ్చు చల్లారేది కాదు. ఈ కథ ముగిసిపోలేదు. సంక్రాంతి తరువాత ప్రకటన వస్తుందనుకుంటున్నారు. మంత్రులతో, ఐఏఎస్‌ అధికారులతో…

ఏపీలో రాజధాని మార్పు నిర్ణయంపై ప్రకటన చేయడాన్ని సీఎం జగన్‌ వాయిదా వేసినప్పటికీ ఇప్పటికైతే ఈ చిచ్చు చల్లారేది కాదు. ఈ కథ ముగిసిపోలేదు. సంక్రాంతి తరువాత ప్రకటన వస్తుందనుకుంటున్నారు. మంత్రులతో, ఐఏఎస్‌ అధికారులతో కూడిన హైపవర్‌ కమిటీని నియమించి, దానికి మూడు వారాలు టైమిచ్చి, అది నివేదిక ఇచ్చాక రాజధానిపై నిర్ణయాన్ని జగన్‌ ప్రకటిస్తారు. రాజధానిగా విశాఖ నిర్ణయం జరిగిపోయినా మరికొంత ప్రజాస్వామికంగా వ్యవహరించడానికి జగన్‌ సమయం తీసుకుంటున్నారు. జగన్‌ కేబినెట్‌ సమావేశంలో మాట్లాడినదాన్ని బట్టి రాజధాని మార్పు తథ్యమనే విషయం స్పష్టమైపోయింది. ఇదిలా ఉంటే, స్పీకర్‌ పాత్ర కంటే రాజకీయ నాయకుడి పాత్రనే సమర్థంగా పోషిస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం మరోసారి రంగంలోకి దిగారు. 

మూడు రాజధానులను వ్యతిరేకించేవారంతా తుగ్లక్‌లేనని అన్నారు. ఎవరు ఎటువంటి హంగామా, హడావుడి చేసినా జరిగేది జరగక మానదన్నారు. అంటే రాజధాని మార్పు గ్యారంటీ అని చెప్పారన్నమాట. విశాఖను రాజధానిగా వ్యతిరేకించేవారంతా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకోనివారేనని అన్నారు. ఇక తమ్మినేని మరో ముఖ్యమైన సంగతి చెప్పారు. 'స్థానిక సంస్థల ఎన్నికల్లో, 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశమే రెఫరెండం అవుతుంది' అన్నారు. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజలంతా ఆమోదముద్ర వేస్తారని స్పీకర్‌ ఉద్దేశం. ఆ ఎన్నికల్లో తుగ్లక్‌ ఎవరో తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన చేశాక తమ్మినేని ఉండలేకపోతున్నారు. 

సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగానే రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. ప్రతిపక్షం టీడీపీపై విరుచుకుపడుతున్నారు. అమరావతిలో వెళుతుంటే ఎడారిలో పోతున్నట్లుగా ఉందన్నారు. ఇది అమరావతి ప్రజలను అవమానించినట్లు కాదా? అమరావతి ప్రజలు మూడు రాజధానులు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేనికి చుర్రుమంటున్నది. అమరావతిలో భూముల విలువ పడిపోయిందని ఆందోళన చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అమరాతిని లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగిస్తామని, ఇంకా ఏంటి మీ బాధ అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా ఆమోదిస్తారా? లేదా? అమరావతిలో లెజిస్లేచర్‌ కేపిటల్‌ కావాలా? వద్దా? కర్నూలులో హైకోర్టు పెట్టాలా? వద్దా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

జగన్‌ చేసిన మూడు రాజధానుల ఆలోచన బ్రహ్మాండంగా ఉందన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి పాలనను అన్ని ప్రాంతాలకు తీసుకెళుతుంటే ఇంకా ధర్నాలు, ఆందోళనలు ఎందుకన్నారు. ఈరోజు రెఫరెండం ముచ్చట తెచ్చారు. ఇక జగన్‌ విషయానికొస్తే 'రాజధాని మార్పు విషయంలో నాకు తొందరేమీ లేదు. సమగ్ర అధ్యయనం తరువాతనే నిర్ణయం తీసుకుందాం' అని  కేబినెట్‌ సమావేశంలో చెప్పారు. రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు చెప్పాకే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుందామని కూడా అన్నారు. రాజధాని మార్పుపై ఈ రోజే నిర్ణయం వస్తుందని అమరావతి ప్రాంత ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజానీకమంతా అనుకుంది. అన్ని పార్టీలూ భావించాయి. ఈరోజు కేబినెట్‌ సమావేశంలో బాంబు పేలుస్తారని అనుకున్నారు. 

కాని సీఎం జగన్‌ వాయిదా వేశారు. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాయిదా వేయడానికి ఏమీ లేదు. కాని ప్రజాగ్రహం చూశాక వెనక్కి తగ్గి ఉంటారు. అందుకే అధ్యయనం, హైపవర్‌ కమిటీ అంటూ వాయిదా వేశారు. నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేశారు తప్ప నిర్ణయంలో మాత్రం మార్పు లేదు. జగన్‌ ఈ విషయాన్ని మరోలా చెప్పారు. అమరావతిలో రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేయాలంటే లక్ష కోట్లు ఖర్చు చేయాల్సివుంటుందని, అదే విశాఖపట్టణంలో అయితే పది వేల కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాదును తలదన్నే నగరాన్ని నిర్మించుకోవచ్చని జగన్‌ అన్నారు. అంటే అర్థమేమిటి? రాజధాని మార్పు నిర్ణయంలో మార్పు లేనట్లే కదా. 

అమరాతిలో ఎంత ఖర్చు చేసినా వృథాయేనని అన్నారు. అక్కడ ఎంత భారీగా ఖర్చు చేసినా వరల్డ్‌క్లాస్‌ నగరాన్ని నిర్మించడం అసాధ్యమన్నారు. రాజధానికి కనెక్టివిటీ (రోడ్లు, రైళ్లు, విమానాలు) చాలా ముఖ్యమని,  కనెక్టివిటీ ఉంటేనే ప్రముఖ సంస్థలు, ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రానికి  వస్తాయని, పెట్టుబడులు పెడతాయని జగన్‌ అన్నారు. రాజధాని మార్పు గురించి జగన్‌ అధికారికంగా ప్రకటించేవరకు అమరావతి ప్రజలు కాస్తంత ఆందోళనలు విరమిస్తారేమోగాని భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది.

కూల్ బాబూ కూల్ పేర్నినాని జోకులు