ఓ పని ఆగిపోయింది. దాంతో ముడిపడి వున్న ఇంకో పని కూడా ఆగిపోయినట్లేనా? ఏమిటీ రెండు పనులు? ఏపీ కేబినెట్ ఈ రోజు సమావేశమైన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలోనే విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటిస్తారనే ప్రచారం భారీగా జరిగింది. ఈ ప్రచారం చేసింది ఎవరు? వైకాపా నాయకులు, మంత్రులు, స్పీకరు తదితరులు. ఈ సందర్భంలోనే అమరావతి గురించి వీరు చాలా వెకిలిగా, అవహేళనగా మాట్లాడారు.
అక్కడ ఆందోళన చేస్తున్నవారిని ఎద్దేవా చేశారు. వీరంతా గొప్ప రాజకీయ అనుభవజ్ఞులు. వీరంతా దాదాపుగా ఈ రోజు రాజధాని ప్రకటన వస్తుందన్నట్లే మాట్లాడారు. కాని కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి జగన్ దాన్ని వాయిదా వేశారనుకోండి.మిగతా అందరికంటే వైకాపా రాజ్యసభ సభ్యుడు, జగన్కు ఆత్మవంటివాడైన విజయసాయి రెడ్డి మరికొంత ఎక్కువగా చెప్పారు. ఇతరులు చెప్పినదానికంటే ఆయన చెప్పిందానికి విలువ, విశ్వసనీయత ఎక్కువగా ఉంటాయి కదా.
కేబినెట్ సమావేశం జరగడానికి ముందు రోజు అంటే నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ 'విశాఖను ఎగ్జిక్యూటవ్ కేపిటల్గా ప్రకటించి సీఎం జగన్ ఉత్తరాంధ్రకు మంచి బహుమానం ఇచ్చారు'..
అన్నారు. సో…విజయసాయి ప్రకటనతో పరీక్షకు ముందే ఫలితం వచ్చినట్లయింది. విజయసాయి చెప్పాడంటే జగన్ చెప్పినట్లే అనుకోవాలి కదా. జనం అదే అనుకున్నారు. ఇదొక్కటే చెప్పి విజయసాయి రెడ్డి ఊరుకోలేదు.
డిసెంబరు 28న (రేపు) సీఎం జగన్ విశాఖకు వస్తున్నారని, ఆయన ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మరి ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయి చెప్పారంటే విశాఖను రాజధానిగా ప్రకటిస్తున్నారని అర్థమే కదా.
కేబినెట్ సమావేశం ముగిసిన తెల్లవారే జగన్ విశాఖకు బయలుదేరుతున్నారు. 24 కిలోమీటర్ల మేర జనం మానవహారంలా ఏర్పడి జగన్కు స్వాగతం చెబుతారని విజయసాయి అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వాగతం చెప్పే కార్యక్రమమే మూడు గంటలపాటు కొనసాగుతుందని అన్నారు.
సాధారణ పర్యటన అయితే ఇంత హడావుడి ఉండదు కదా. ఇంత సంబంరంగా ఉండదు కదా. కాబట్టి విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా అధికారికంగా ప్రకటించడానికి నిర్ణయం జరిగిపోయిందని అంతా భావించారు. కాని జనం అనుకున్నట్లు జరగలేదు. రాజధాని మార్పుపై కేబినెట్లో నిర్ణయం తీసుకోలేదు. మరి రేపు సీఎం జగన్ విశాఖపట్టణం వెళుతున్నారా? ఒకవేళ వెళితే ఆయనకు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారా?
మూడు గంటలపాటు దారి పొడుగునా స్వాగత సంరంభం, సంబరం కొనసాగుతాయా? ఈ విషయంపై సమాచారం లేదు. జగన్ విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వెళుతున్నట్లు అంతకుముందు సమాచారం వచ్చింది.
ఇది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కాబట్టి వెళతారేమో…! కాని విజయసాయి రెడ్డి చెప్పిన సంబరం ఉంటుందా, ఉండదా అనేది తెలియలేదు. రాజధాని మార్పు నిర్ణయం ప్రకటన వాయిదా వేసినప్పటికీ వచ్చే నెల్లో అంటే జనవరిలో ప్రకటన చేయడం తథ్యం. కాబట్టి విశాఖవాసులేమీ ఆందోళన చెందరు. ఈరోజు కేబినెట్ తరువాత మంత్రి పేర్ని నాని నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి చెప్పిన ఘన స్వాగతం గురించి ఓ విలేకరి ప్రస్తావించగా మంత్రి దాన్ని తోసిపుచ్చారు.
విజయసాయి రెడ్డి విశాఖ జిల్లాకు ఇన్చార్జిగా ఉన్నారని, విశాఖ పట్టణం రాజధాని కావాలనేది ఆయన వ్యక్తిగతమైన కోరిక అని సర్ది చెప్పారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి పరిస్థితి 'తొందరపడి ఒక కోయిల ముందే కూసింది'
అన్నట్లుగా తయారైంది. జగన్ మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో ప్రతిపాదించినప్పటినుంచి వైకాపా నాయకులు, మంత్రులు యమ ఉత్సాహపడిపోయారు. అంతా వీళ్లే కన్ఫర్మ్ చేసేశారు. విజయసాయి రెడ్డి కూడా విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా ప్రకటించిన తరువాత సీఎం జగన్ మొదటిసారిగా విశాఖ వస్తున్నారని చెప్పారు. జగన్ ప్రకటించకముందే ఈయన తానే సీఎంగా ప్రకటన చేసేశారు.