జనసేనాని పవన్‌కల్యాణ్ పొలిటికల్ కామెంట్స్ ఆయనపై రివర్స్ అటాక్‌కు కారణమవుతున్నాయి. తాజాగా మరోసారి పవర్‌స్టార్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం భీమ్లానాయక్ వాయిదా పడడమే. పవన్ కళ్యాణ్, దగ్గు బాటి రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భీమ్లా నాయక్’.
ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథా నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఇటు పవన్ అభిమానులు, అటు రానా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఈ సినిమాకు కేవలం ఐదు రోజుల ముందు ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల కానుంది. దీంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున దిల్ రాజు ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని వాయిదా వేయమని నిర్మాతల్ని కోరారు.
దిల్‌రాజు విన్నపాన్ని మన్నించి భీమ్లానాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయమై దిల్‌రాజు మాట్లాడుతూ తమ విజ్ఞప్తికి పవన్, నిర్మాత రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారన్నారు. పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పుడు… ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయని ఆయన అన్నారు.
అయితే సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్మాతలు, హీరోల ఇష్టం. ఇటీవల మంగళగిరిలో విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావంగా చేపట్టిన దీక్షలో పవన్ ఆవేశపూరిత ప్రకటనే ఆయన్ను ప్రశ్నించేలా చేసింది. తన సినిమాలను ఫ్రీగా అయినా రిలీజ్ చేస్తానే తప్ప, వైసీపీ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ హెచ్చరికను గుర్తు చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఫ్రీగా రిలీజ్ చేసుకుంటా అని గొప్పలు చెప్పావే ఇప్పుడేమైంది? అని నెటిజన్లు నిలదీస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఫ్రీగా సినిమా చూపిస్తానని ప్రగల్భాలు పలికిన హీరోగారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతే ఏమిటి? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు వాయిదా వేసుకోవడం ఎందుకు సార్? ఓహో డబ్బులు పోతాయనే కదా? అని కామెంట్స్‌తో దెప్పి పొడుస్తున్నారు.
అందుకే ఒక ప్రకటన చేసేటప్పుడు ముందూ వెనుకా ఆలోచించాలని చెప్పేది అని హితవు పలుకుతున్నారు. పవన్‌కల్యాణ్ మాటలకు ఎప్పుడు మాత్రం స్థిరత్వం ఉందంటూ వెటకరిస్తుండడం గమనార్హం.