151 స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది జగన్ అనే సునామీ కారణంగా. సరే మళ్లీ టేబుల్ టర్న్ కాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం తమ్ముళ్లు. అన్ని వైపుల నుంచి అష్ట దిగ్బంధనం చేస్తూ, కులాల మీదుగా టార్గెట్ చేస్తూ, మీడియాలో బదనామ్ చేస్తూ, సోషల్ మీడియాలో వీలయినంత ప్రచారం చేస్తూ ఎలాగైనా జగన్ ను 2024 నాటికి గద్దె దింపాలని తెలుగుదేశం లోని కీలక వర్గం కిందా మీదా అవుతోంది.
ఇది చూసి, మళ్లీ మనకు అధికారం అందుతుంది అని ఇచ్ఛాపురం నుంచి కడప కర్నూలు వరకు చాలా మంది ఆశపడుతున్నారు. ఆ ఆశలు నెరవేరుతాయా? కావా? అన్నది సంగతి అలా వుంచితే, రకరకాల కారణాల వల్ల చాలా మంది తెలుగు తమ్ముళ్లు త్యాగరాజులు కావాల్సి వచ్చేలా వుంది.
జనసేన కోసం త్యాగం
ఈసారి ఎలాగైనా, ఆరు నూరైనా, నూరు ఆరైనా తెలుగుదేశం-జనసేన పొత్తు పక్కా అని రాజకీయ వర్గాల్లో డిసైడ్ అయిపోయింది. 2014లో భాజపా పక్కన చేరి, తెలుగుదేశం కోసం పని చేసి, 2018లో భాజపాను, తేదేపాను రెండింటినీ వదిలేసి, 2020లో మళ్లీ భాజపా పక్కన చేరిన పవన్ కళ్యాణ్ మరోసారి తన మద్దతును తెలుగుదేశం వైపు తిప్పబోతున్నారని బోగట్టా. తడవకో విధంగా ఇలా మద్దతును మారుస్తూ రావడం వల్ల ఆయన క్రెడిబులిటీ ఏ మేరకు వుంటుంది అన్నది పక్కన పెడితే, ఈ పొత్తు కారణంగా కనీసం 40 ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీకి ఇవ్వాల్సి వస్తుందని టాక్ వినిపిస్తోంది.
జిల్లాకు మూడు వంతున జనసేనకు సీట్లు ఇవ్వాల్సి వుంటుందని ముందే ఓ అంచనాకు వచ్చేసారు. ఈ మేరకు ఏయే సీట్లు ఇవ్వాల్సి వుంటుందనే దాని మీద అంతర్గత సర్వేలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అంటే 175 సీట్లలో 40 చోట్ల తెలుగు తమ్ముళ్లకు నిరాశే.
పొత్తులు చాలా వున్నాయ్
ఇవి కాక ఇంకా వేరే పొత్తులు కూడా వుంటాయని వినిపిస్తోంది. వామపక్షాలు, కాంగ్రెస్ కూడా కలిసి వచ్చే అవకాశం వుందని వినిపిస్తోంది. చివరి వరకు బాజపాతో కలిసి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. తప్పకపోతే కాంగ్రెస్ తో కూడా చేతులు కలుపుతారని వినిపిస్తోంది. అలా అయితే మరో పది సీట్లు వరకు త్యాగం చేయాల్సి రావచ్చు.
దాదాపు అన్ని పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చి, రాష్ట్రం నాశనం అయిపోతోందని, అందుకే తామంతా చేతులు కలిపామని, ప్రజలకు నమ్మబలికే కార్యక్రమం చేపడతారు. జనతా ప్రయోగం మాదిరిగా అందరూ ఒకటైతే తప్ప జగన్ ను ఓడించడం కష్టం అనే ఆలోచనకు విపక్షాలు అన్నీ చేరుకున్నట్లే.
పోత్తు లేకుంటే చిత్తే
పొత్తులు లేకపోతే తెలుగుదేశం చిత్తే అని రాజకీయ వర్గాల్లో ఓ బలమైన వాదన వుంది. అందువల్ల ఈసారి కిందా మీదా పడి అయినా పొత్తులతోనే వెళ్లాలని తెలుగుదేశం అధినేత ఫిక్స్ అయ్యారని, ఈ విషయంలో లోకేష్ కాస్త వేరే ఆలోచనలతో వున్నా, పెద్దాయన మాటే చెల్లుతుందని రాజకీయ వర్గాల బోగట్టా.
యంగ్ తరంగ్
ఇదిలా వుంటే ఈసారి వీలయినంత మంది కొత్త ముఖాలు, యంగ్ ఫేస్ లు తెరపైకి వస్తాయని తెలుగుదేశం వర్గాల బోగట్టా. వీరిలో చాలా మంది వరకు వారసులు వుంటారు. చాలా మంది బాబుగారి సమకాలికులు ఈసారి రిటైర్ తీసుకోవాల్సి వుంటుందని వినిపిస్తోంది. అధికారంలో వున్న వైకాపా ను తట్టుకోవాలంటే యువ నాయకులనే ముందుకు పెట్టాలని పార్టీ భావిస్తోంది.
అందువల్ల 2019లో ఓటమి పాలయిన చాలా మంది సీనియర్లు ఈసారి ఇక శాశ్వతంగా పక్కకు తప్పుకోవాల్సిందే. అధికారంలోకి వస్తే పోస్టులు ఇస్తామనే హామీతో వీరిని తప్పిస్తారని టాక్.
మొత్తం మీద చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో 2024 నాటికి త్యాగాల పర్వం బలంగా ప్రారంభం అవుతుందని అనుకోవాల్సిందే.