వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లను విమర్శించడం అంటే ఎంతో ఇష్టం. చంద్రబాబు హయాంలో తనకు జరిగిన పరాభవాన్ని రోజా ఎప్పటికీ మరిచిపోరు. అసెంబ్లీ నుంచి బహిష్కరించడం, మహిళా సదస్సుకు వెళుతున్న రోజాను పోలీసులు అడ్డుకుని రోజంతా ఎక్కడెక్కడో తిప్పుతూ చివరికి విడిచి పెట్టిన విషయాల్ని ఆమె పదేపదే గుర్తు చేస్తుంటారు.
తాజాగా ఆమె మాటల తూటాలు నారా భువనేశ్వరి వైపు దూసుకెళ్లాయి. భువనేశ్వరి భుజాలపై తుపాకి పెట్టి వైసీపీని కాల్చాలనే టీడీపీ ప్రయత్నాలను అధికార పార్టీ పసిగట్టి రివర్స్ అటాక్ చేస్తోంది. తిరుపతిలో నిన్న పర్యటించిన భువనేశ్వరి వైసీపీ నేతలకు హితవు చెప్పడం, వాటికి దీటుగా మంత్రి కొడాలి నాని సమాధానం ఇవ్వడం తెలిసిందే. ఇవాళ భువనేశ్వరిపై తనదైన స్టైల్‌లో రోజా విరుచుకుపడ్డారు.
‘ఆడవారిని ఏడిపించిన వారి పాపాన వారే పోతారని భువనేశ్వరి అన్న మాటలు నిజమే. అందుకే 23 అసెంబ్లీ స్థానాలకే తెలుగు దేశం పార్టీ పరిమితం అయ్యింది. చంద్రబాబు వల్లే భువనేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉంది.. మీరు (భువనేశ్వరి) జాగ్రత్తగా ఉండాలి. ఎన్టీఆర్‌ను ఏడిపించారు. నన్ను కూడా ఏడిపించారు. చంద్రబాబు పాలనలో కాల్‌మనీ కేసులో మహిళలు వ్యభిచారం చేయాల్సి వచ్చింది. గోదావరి పుష్కరాల్లో 30 మహిళలు చనిపోయారు. అప్పుడు భువనేశ్వరి ఎందుకు నోరు తెరవలేదు?. జరగని దానికి జరిగిందని చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారు. దానిపై భువనేశ్వరి మాట్లాడం అంటే రాజకీయ లబ్ధి కోసం భార్యను రోడ్డుకు ఈడ్వడమే’ అని రోజా పంచ్ డైలాగ్‌లతో భువనేశ్వరి విమర్శలను తిప్పి కొట్టారు.
భువనేశ్వరి కేంద్రంగా సాగిన దుష్ట రాజకీయానికి తెరపడిందనుకుంటే, మళ్లీ ప్రారంభమైనట్టు గత 24 గంటలుగా చోటు చేసుకున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఆమెతో ప్రత్యర్థులపై విమర్శలు చేయించడం, అటు వైపు నుంచి ఎదురు దాడి జరిగితే మాత్రం మహిళని కూడా చూడకుండా వైసీపీ దూషణలకు దిగుతోందనే దుష్ప్రచారం చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో భువనేశ్వరి అనూహ్యంగా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.