అమేథీ, రాయబరేలీ.. దశాబ్దాలుగా నెహ్రూ, గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా కొనసాగుతున్న నియోజకవర్గాలు. అయితే 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాహుల్ గాంధీ. కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఐదు శాతం ఓట్ల తేడాతో.. దాదాపు యాభై ఐదు వేల ఓట్ల తేడాతో రాహుల్ గాంధీ ఓటమిని మూటగట్టుకున్నాడు. అయితే అదే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా నెగ్గి లోక్ సభలో కొసాగుతున్నాడు రాహుల్.
ఇక రాహుల్ తల్లి సోనియాగాంధీ రాయబరేలీ నుంచి ఎంపీగా నెగ్గి, పరువు కాపాడుకున్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ అమేథీకి గుడ్ బై చెప్పినట్టేనా? అనే చర్చకు రాహుల్, ప్రియాంకలు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమేథీలో ఈ అన్నాచెల్లెళ్లు ర్యాలీ నిర్వహించారు. అక్కడ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో అమేథీని తాము ఖాళీ చేసి వెళ్లిపోలేదనే సంకేతాలను కూడా ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు మిగిలే ఉన్నట్టుగా తెలుస్తోంది. రాయబరేలీ, అమేథీల్లో వీరి కుటుంబీకులు పోటీలో ఉంటారని స్పష్టం అవుతోంది. ఒకవేళ సోనియాగాంధీ వచ్చే సారి పోటీలో ఉంటే.. ఆమె రాయబరేలీ నుంచినే పోటీ చేస్తారని, రాహుల్ మరోసారి అమేథీతో పాటు వయనాడ్ నుంచి కూడా పోటీ చేయవచ్చని ఢిల్లీ టాక్.
ఒకవేళ సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల పోరు నుంచి తప్పుకున్నట్టైతే.. రాయబరేలీ నుంచి ప్రియాంక పోటీలోకి దిగవచ్చని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. రాయబరేలీ నుంచి రాహుల్ పోటీ చేసి, అమేథీ బాధ్యతలను ప్రియాంక తీసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయట. స్థూలంగా ఒక ఓటమితో ఆ నియోజకవర్గాన్ని వదిలేది లేదని గాంధీ కుటుంబం గట్టిగానే అనుకుంటోందని అమేథీ ర్యాలీతో స్పష్టం అవుతోంది.