పెద్ద గీత పక్కన చిన్నగీత గీసినప్పుడు.. మొదటి గీత మరింత పెద్దదిగా అనిపిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ క్రియేటివిటీ స్థాయి విషయంలో కూడా ఇదే అభిప్రాయమే వ్యక్తం అవుతూ ఉంది. ఎంతలా అంటే.. పుష్ప మీద స్పందించే వాళ్లంతా, రంగస్థలాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడానికి కొన్ని లైన్లను కేటాయిస్తూ ఉన్నారు!
కొందరు అయితే.. రంగస్థలం సినిమాను ఆల్ టైమ్ క్లాసిక్ రేంజ్ కు అభివర్ణిస్తూ ఉన్నారు. రంగస్థలం నిస్సందేహంగా సూపర్ హిట్ సినిమా. అందులో రామ్ చరణ్ ప్రదర్శనను కానీ, సుకుమార్ కష్టాన్ని కానీ తక్కువ చేయలేం. అయితే తన కథ కోసం కాలాన్ని వెనక్కు తీసుకెళ్లిన సుకుమార్, కథ విషయంలో మాత్రం కొత్త అడుగులు వేయలేకపోయారు.
కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా, పాత్రల విషయంలో ప్రయోగాత్మకంగా వ్యవహరించినా, వాటిని పండించడంలో సక్సెస్ అయినా, కథ విషయంలో మాత్రం పాత చింతకాయ పచ్చడిని పంచారు. అదే కథను సాదాసీదా బ్యాక్ డ్రాప్ లో చెప్పి ఉంటే అంతే సంగతులు. వర్తమాన కాలానికి భిన్నమైన నేపథ్యం నుంచి పాత కథను వివరించి అప్పుడు సుకుమార్ భిన్నమైన ట్రీట్ ఇచ్చి క్యాష్ చేసుకున్నాడు. వసూళ్ల వర్షం కురిసింది.
అలా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు పుష్పతో కనీసం రంగస్థలం మ్యాజిక్ ను సుకుమార్ రిపీట్ చేయలేకపోయాడు. అయితే పుష్ప అనే చాలా చిన్నగీతను గీసి సుకుమార్ రంగస్థలాన్ని క్లాసిక్ అనిపించేస్తూ ఉన్నాడు క్రిటిక్స్ చేత. అప్పట్లో ఈ క్రిటిక్స్ కూడా రంగస్థలం విషయంలో ఈ రేంజ్ లో ప్రశంసలు కురిపించలేదు.
అయితే పుష్ప తేడా అనిపించే సరికి మాత్రం.. రంగస్థలాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. మొత్తానికి చిన్న గీత గీసి.. పాత గీతను పెద్ద గీత అనిపిస్తున్నాడు దర్శకుడు సుకుమార్!