పాపం రష్మిక.. దర్శకుల క్రియేటివిటికీ ఒక్కోసారి తను ట్రోల్ కు గురవుతూ ఉంటుంది. ఇది వరకే.. సరిలేరు నీకెవ్వరూ విషయంలో రష్మికను నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. నీకర్థమవుతోందా.. అంటూ రష్మిక చేసే యాక్షన్ మొదట్లో ఓకే అనిపించినా, సినిమా చూస్తున్న క్రమంలో విసుగు తెప్పిస్తుంది. ఇక ఐయామ్ ఇంప్రెస్డ్ అంటూ మహేశ్ ను వాటేసుకునే వైనం, క్లైమాక్స్ లో మళ్లీ నీకర్థమవుతోందా.. అంటూ చేసే యాక్షన్ ఓవరాక్షన్ అనిపించుకుంది.
వాస్తవానికి తనో డీసెంట్ యాక్ట్రెస్. గీతాగోవిందం సినిమాలో తన పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్ ను చూపించింది. ఇక భీష్మలో స్ట్రిక్ట్ గా సాగే పాత్రను పండించింది. అయితే.. ఇప్పుడు పుష్ప విషయంలో మళ్లీ రష్మిక ట్రోల్ కు బలవుతోంది.
సినిమాలో రష్మిక డ్యాన్స్, మేనరిజమ్స్ అంతా పాత్ర పరిధి మేరకే ఉండవచ్చు. అయితే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా రష్మిక ఆ ఎక్స్ ప్రెషన్లు, డ్యాన్సులూ చేస్తూ ఉంది. హిందీ ప్రమోషన్లో అయితే.. రష్మిక కూర్చోనే డ్యాన్స్ బిట్ ఎక్స్ ప్రెషన్లు ఇస్తోంది. ఇక సోషల్ మీడియాకు కూడా అలాంటి వాటిని ఎక్కించిందామె.
సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఇలాంటివి అంత అవసరం ఉండదు. అయితే ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఈ ఫీట్లన్నీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రష్మిక చేస్తున్నది అదే. మరి ఇదంతా మళ్లీ సరిలేరు నీకెవ్వరు రోజులను గుర్తు చేస్తోంది. ఆ సినిమా సమయంలో రష్మికను ఎలా ట్రోల్ చేశారో.. ఇప్పుడు మళ్లీ అలాంటి ట్రోలే తప్పడం లేదు.
కొందరేమో రష్మిక ప్రమోషన్ ను ఎక్స్ ప్రెసివ్ అంటుంటే, మరి కొందరేమో.. ఓవరాక్టింగ్ క్వీన్ అంటూ బిరుదును ఇస్తున్నారు! సరిలేరు విషయంలో అంతా తను దర్శకుడు చెప్పినట్టుగా చేసి, చేతులు దులుపుకునే యత్నం చేసింది రష్మిక. అయితే ఇప్పుడు మాత్రం ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా సినిమా ఫీట్లనే ధైర్యం గా చేస్తూ ఉంది.