దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పటినుంచి పోరు బాటలోనే కొనసాగుతోంది. తెలంగాణాకు రావడం రావడమే కేసీఆర్ పై పోరాటంతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది. ముందుగా నిరుద్యోగ సమస్యపై గళమెత్తిన షర్మిల ఇందిరా పార్కులో మూడు రోజుల నిరాహార దీక్షకు కూర్చుంటే రెండోరోజే ప్రభుత్వం భగ్నం చేసింది. మిగతా రెండు రోజులు లోటస్ పాండ్ లో కొనసాగించింది.
ఆ తరువాత ఉద్యోగాలు రాలేదన్న ఆవేదనతో ప్రాణాలు తీసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చేందుకు వారి ఊళ్లకు వెళ్లి నిరాహార దీక్షలు చేసింది. ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ దీక్ష కోసం కేటాయించింది. దీనిపై ప్రతికూలత రావడంతో పాదయాత్ర మొదలుపెట్టింది. మధ్యలో ఎన్నికల కోడ్ కారణంగా అది ఆగిపోయింది. కొన్నాళ్లుగా వరి కొనుగోలుకు సంబంధించి కేంద్ర -రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చ రేగడంతో షర్మిల దాన్ని అందిపుచ్చుకుంది.
కేసీఆర్ ప్రభుత్వం వరి ఎందుకు కొనదో చూస్తానంటూ ఊరూరు తిరగడం మొదలు పెట్టింది. దానికి రైతు ఆవేదన యాత్ర అని పేరు పెట్టింది. తాజాగా ఆమె కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఎడ్లూరు ఎల్లారెడ్డిలో పర్యటించింది. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించింది. రైతులు బాజాప్తాగా వరి వేసుకోండని చెప్పింది. ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే ప్రభుత్వంతో వడ్లు కొనేలా చేస్తానని చెప్పింది. ప్రాణం పోయే వరకు రైతుల కోసం కొట్లాడతానంది.
ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ‘ఇది ఆత్మహత్యనా లేక ప్రభుత్వ హత్యనా? వడ్లు ఎప్పటిలాగే కొనుంటే ఈ ఆత్మహత్య జరిగేదా? రైతులకు చావు డప్పు కొడుతున్నది టీఆర్ఎస్సే.. మీరు చావు డప్పు కొట్టేందుకే మిమ్మల్ని సీఎంను చేసుకున్నారా..’ అంటూ ఫైర్ అయింది. వరి వేయబోమని కేంద్రం దగ్గర సంతకం ఎవరిని అడిగి పెట్టారని సీఎం కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించింది.
‘రెండు నెలల్లో 200 మంది రైతుల కుటుంబాలకు పైసా సాయం చెయ్యలేదు కానీ హరియాణాలో చనిపోయిన రైతులకు మూడు లక్షలు ఇస్తానన్నారు. చనిపోయిన రైతుల కుటుంబలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే. వరి వద్దన్న సీఎం మనకు వద్దే వద్దు.. పాలన చేతగాకే కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారు..’ అంటూ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఎలాగూ వరి కొనదు. కాబట్టి షర్మిల ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉండాల్సిందే.