నోట్ల రద్దు సమయంలో తమిళనాడు రాజకీయ నేత శశికళ భారీ ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసిందని ప్రభుత్వ వర్గాలు కోర్టుకు సమాచారం ఇచ్చాయి. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే రద్దైన కరెన్సీతో ఆమె ఆస్తులను కొనుగోలు చేసినట్టుగా ఆదాయపు పన్ను వర్గాలు కోర్టుకు సమాచారం ఇచ్చాయి. మారకంలోని ఐదు వందల, వెయ్యి రూపాయల నోట్లు రద్దు కాగానే.. శశికళ ఆ మేరకు ఆస్తుల కొనుగోలు చేసినట్టుగా విచారణలో తేలినట్టుగా పేర్కొన్నాయి.
అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై మరిన్ని కేసులు నమోదయ్యేలా ఉన్నాయి. కొన్నాళ్లలో శశికళ శిక్ష కాలం పూర్తి కాబోతోంది. ఆమె బయటకు వస్తే.. తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆమెపై మళ్లీ కొత్త కేసులు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో విచారణ కమిటీలు చెబుతున్న ఆస్తుల వివరాలపై శశికళ తరఫు న్యాయవాదులు స్పందించారు. ఆ ఆస్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని శశికళ స్పష్టం చేసినట్టుగా వారు చెబుతున్నారు. అలాగే ఈ సందర్భంగా శశికళ తన ఆస్తుల ప్రకటన కూడా చేసిందట. తనకు ఎక్కడెక్కడ ఏయే ఆస్తులున్నాయో ప్రకటించి, నోట్ల రద్దు సమయంలో తను కొన్నట్టుగా చెబుతున్నవి ఏవీ తన ఆస్తులు కాదని శశికళ స్పష్టం చేసిందట. ఇలా తనకు అక్రమాస్తులు లేవని ఆమె డిక్లరేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అయితే అవన్నీ బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్టుగా విచారణ వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది రాజకీయ నేతలు తమ పేర్లతో ఆస్తులు పెట్టుకోరంటారు. తమ చేతికి ఉంగరం లేదు, వాచీ లేదు.. అంటూ వారు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. అయితే అలర్జీలతో వారు వాటిని ధరించరని, ఆస్తులన్నింటినీ బినామీ పేర్లతో ఉంచుతారనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో శశికళ కూడా తనకూ ఆ ఆస్తులకూ సంబంధం లేదని ప్రకటించి ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.