విశాఖ‌లో టీడీపీ వికెట్ డౌన్‌

విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా త‌మ పార్టీ వ్య‌తిరేకించ‌డంతో పాటు ఎన్ఆర్‌సీ బిల్లుకు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డాన్ని నిర‌సిస్తూ విశాఖ టీడీపీ అర్బ‌న్ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహ‌మాన్ ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు.…

విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా త‌మ పార్టీ వ్య‌తిరేకించ‌డంతో పాటు ఎన్ఆర్‌సీ బిల్లుకు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డాన్ని నిర‌సిస్తూ విశాఖ టీడీపీ అర్బ‌న్ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహ‌మాన్ ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. అనంత‌రం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ ప‌రిపాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌ను ప్ర‌తిపాదించ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు తెలిపారు. విశాఖ కార్పొరేష‌న్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది చంద్ర‌బాబేన‌ని మండిప‌డ్డారు. 

రాజధాని అనేది విశాఖ ప్రాంతవాసుల కల అని చెప్పిన రెహమాన్ అన్నారు. అలాంటి అరుదైన అవ‌కాశం జ‌గ‌న్ వ‌ల్ల విశాఖ‌కు వ‌చ్చింద‌ని, దాన్ని వ్య‌తిరేకించి చ‌రిత్ర హీనులుగా మిగ‌లాల‌నుకోలేద‌న్నారు. అందువ‌ల్లే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న‌ట్టు రెహ‌మాన్ తెలిపారు. విశాఖ రాజధాని కావాలని  గతంలోనే తాము కోరామన్నారు. రాజ‌ధాని కోసం తాను పోరాటం కూడా చేశానని చెప్పారు. అమరావతి  విష‌యంలో తప్పుడు రాజకీయాలు చేయవద్దని చంద్రబాబుకు హితవు  పలికారు.  

లోకేశ్‌పై ఆగ్ర‌హం
లోకేశ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక తాము చంద్ర‌బాబుకు దూర‌మ‌య్యామ‌ని వాపోయారు. లోకేశ్ వ‌ల్ల టీడీపీ భ్ర‌ష్టు ప‌ట్టింద‌న్నారు. అత‌ని వ‌ల్లే టీడీపీ ప్ర‌జ‌ల‌కు దూర‌మైంద‌ని ఆరోపించారు.

జ‌గ‌న్‌కు ముస్లింలు రుణ‌ప‌డ్డారు
ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం తమకు సంతోషాన్నిచ్చింద‌న్నారు. ఏపీలో ఎన్నార్సీ అమలు చేయటం లేదని ప్రకటించిన సీఎం జగన్‌కు మైనార్టీలంతా రుణపడి ఉన్నామన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎన్నార్సీని వ్యతిరేకించనందుకు టీడీపీ విశాఖ అర్బన్‌ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయ‌న‌ ప్రకటించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు

జగన్ గోప్ప నిర్ణయం తీసుకున్నారు