అంద‌రి దృష్టి కేబినెట్ స‌మావేశంపైనే

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లంద‌రి దృష్టి శుక్ర‌వారం జ‌గ‌న్ కేబినెట్ మీటింగ్‌పైనే. రాజ‌ధాని మార్పుపై జీఎన్ రావు క‌మిటీ ఇచ్చిన నివేదిక‌పై కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించి ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ నిర్ణ‌యం ప్ర‌స్తుత రాజ‌ధాని…

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లంద‌రి దృష్టి శుక్ర‌వారం జ‌గ‌న్ కేబినెట్ మీటింగ్‌పైనే. రాజ‌ధాని మార్పుపై జీఎన్ రావు క‌మిటీ ఇచ్చిన నివేదిక‌పై కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించి ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ నిర్ణ‌యం ప్ర‌స్తుత రాజ‌ధాని అమ‌రావ‌తి భ‌విష్య‌త్‌ను తేల్చ‌నుంది.

ఈ నెల 17న అసెంబ్లీలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న తీవ్ర దుమారం రేపుతోంది. ఆ త‌ర్వాత రాజ‌ధానిపై అధ్య‌య‌నం చేసిన జీఎన్ రావు క‌మిటీ కూడా సీఎంకు నివేదిక స‌మ‌ర్పించింది. అనంత‌రం జీఎన్ రావుతో పాటు క‌మిటీ స‌భ్యులు విలేక‌రుల‌తో మాట్లాడుతూ అమ‌రావ‌తిలో అసెంబ్లీ, విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని, శ్రీ‌బాగ్ ఒప్పందం ప్ర‌కారం క‌ర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని, రాజ‌ధాని రైతుల‌కు న్యాయం చేయాల‌ని, త‌దిత‌ర ఇత‌ర అంశాల‌పై సిఫార్సు చేసిన‌ట్టు పేర్కొన్నారు.

జీఎన్‌రావు క‌మిటీ నివేదిక ప్ర‌కార‌మే రాజ‌ధాని భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంటుంద‌ని సీఎంతో పాటు మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, పేర్ని నాని త‌దిత‌రులు చెబుతూ వ‌స్తున్నారు. మ‌రోవైపు మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాజ‌ధాని రైతులు ఆందోళ‌న‌ల‌కు దిగారు. వారికి ప‌లు రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి.

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి, రాజ‌ధాని సంయుక్త కార్యాచ‌ర‌ణ స‌మితి (జేఏసీ) త‌దిత‌ర పేర్ల‌తో సంస్థ‌లు ఆవిర్భ‌వించాయి. రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాల‌నే డిమాండ్‌తో ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం నిర్వ‌హించే మంత్రివ‌ర్గ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకొంది. పోలీసులు క‌ట్టుదిట్టమైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాజ‌ధాని రైతుల ఆందోళ‌న‌ల‌పై నిషేధాజ్ఞ‌లు విధించారు. కొత్త‌వారినెవ‌రినీ ఇళ్ల‌లో ఉంచుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.  ఈ మేర‌కు రాజ‌ధాని గ్రామాల ప్ర‌జ‌ల‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజ‌ధానిపై ఉత్కంఠ‌కు తెర‌దించేందుకు మ‌రో 24 గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉంది.