ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై ప్రధాన విమర్శ… పరిశ్రమలు తీసుకురాలేదని, అభివృద్ధి పనులు జరగలేదని. పాలనంతా సంక్షేమం చుట్టూ తిరుగుతోందని, మిగిలిన అంశాల్ని పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. తన పాలనపై వస్తున్న విమర్శలకు విశాఖలో తాజాగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023తో సీఎం జగన్ గట్టి సమాధానం ఇచ్చారు. నాలుగేళ్లలో తీసుకురావాల్సిన పెట్టుబడులన్నీ ఒకే ఒక్క ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో తీసుకొచ్చారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంకా ఇదే పని అధికారంలోకి వచ్చిన కొత్తలో చేసి వుంటే అద్భుతంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పారిశ్రామిక సంస్థలు, వాటి అధినేతలు ఉత్సాహం చూపడం విశేషం. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ఏ విధంగా సానుకూలమైనదో ప్రభుత్వం వివరించింది. అందుకు తగ్గట్టుగానే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు.
పరిశ్రమలు తీసుకురావడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి ఫలించింది. రెండురోజుల సమ్మిట్‌లో భాగంగా మొదటి రోజు సీఎం జగన్ సమక్షంలో ప్రముఖ కార్పొరేట్ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. అలాగే రెండో రోజు శనివారం రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 ఒప్పందాలు జరగనున్నాయి. ఈ పరిశ్రమల రాకతో మొత్తం 6 లక్షల మందికి ఉపాధి దక్కనుంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కార్పొరేట్ దిగ్గజాల్లో రిలయన్స్, అదానీ, ఆదిత్యా బిర్లా, రెన్యూ పవర్, అరబిందో, డైకిన్, జిందాల్ గ్రూప్ తదితర సంస్థలున్నాయి. విశాఖలో పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రతిపక్షాల నోరు మూయించారు. జగన్ పరిపాలనలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే విమర్శ చేస్తున్న వారికి, తాజా ఒప్పందాలతో చెంప ఛెళ్లుమనిపించేలా సమాధానం ఇచ్చారు.
పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు వాటిని స్థాపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ చూపాల్సి వుంటుంది. ఎందుకంటే ఇక తన పాలనకు కేవలం ఏడాది మాత్రమే గడువు వున్న సంగతిని ఆయన మరిచిపోవద్దు. ఒప్పందాలు కార్యరూపం తీసుకుంటేనే జగన్ పాలన ప్రశంసలు అందుకుంటుంది.