హీరోలకు డూప్ లు ఎక్కువగా వాడే రోజులు ఒకప్పుడు వుండేవి. కాస్త రెండు అడుగుల ఎత్తు మీద నుంచి గెంతాలంటే డూప్ గెంతిన షాట్ ఒకటి. నేల మీద నుంచి హీరో లేచిన షాట్ ఒకటి తీసి అతికించేవారు. ఫైటింగ్ లు అయితే సరే సరి.
కానీ ఆ రోజులు పోయాయి. రోప్ షాట్ లు, ఫైట్లు, ఛేజ్ లు, అన్నీ కూడా హీరోలు సాహసంగా చేస్తున్నారు. శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ ఒక హీరో మాత్రం కాస్త క్లోజ్ లు, ఎమోషనల్ షాట్ లు మినహా మిగిలిన చాలా వాటికి డూప్ ల తోనే సరిపెట్టేస్తున్నాడట. ఇది మొదలై చాలా కాలం అయిందట.
ఆ హీరో టాప్ హీరోనే. టాప్ హీరో కనుక వంద కోట్ల మేరకు పారితోషికం తీసుకునే హీరోనే. కానీ ఇద్దరు డూప్ లను సరైన వాళ్లని సెట్ చేసుకున్నాడట. ఒడ్డు పొడవు మాత్రమే కాదు, ప్రోఫైల్ లో చూస్తే చటుక్కున అదే హీరోలా వుండే వాళ్లను ఎంచి దగ్గర పెట్టుకున్నాడట.
కాస్త స్పీడ్ గా నడవాలన్నా, పరుగెత్తాలన్నా, గెంతాలన్నా ఇలా వళ్లు అలిసే సీన్ ఏది చేయాలన్నా డూప్ లే వుంటారట. క్లోజప్ సీన్లు, ఎమోషనల్ సీన్లు, లవ్, రొమాంటిక్ సీన్లు మాత్రం హీరో చేస్తాడట.
ఈ హీరో పెద్ద సినిమాలతో పాటు గుట్టు చప్పుడు కాకుండా ఓ మధ్య రకం సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా షూట్ కు అయితే హీరో కన్నా డూప్ లే ఎక్కువగా వర్క్ చేస్తున్నారనే గుసగుసలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ లెక్కన అయితే ఎన్ని సినిమాలు అయినా చకచకా చేసేయవచ్చేమో.