లోకేశ్ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌…ముంచేస్తున్నాడు!

రానున్న ఎన్నిక‌ల‌ను అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్థుల ఎంపిక‌పై అధినేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. కానీ పాద‌యాత్ర‌లో లోకేశ్ త‌న అనుకునే వాళ్ల అభ్య‌ర్థిత్వాల‌ను ఎక్క‌డిక‌క్క‌డ…

రానున్న ఎన్నిక‌ల‌ను అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్థుల ఎంపిక‌పై అధినేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. కానీ పాద‌యాత్ర‌లో లోకేశ్ త‌న అనుకునే వాళ్ల అభ్య‌ర్థిత్వాల‌ను ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌క‌టిస్తుండ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజాగా ఆయ‌న చంద్ర‌గిరి దాటుకుని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో న‌డుస్తున్నారు.

పుంగ‌నూరు అభ్య‌ర్థిగా చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి అలియాస్ బాబు పేరును ఆయ‌న ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఉస్సూరు మంటూ నిట్టూర్చుతున్నాయి. చంద్ర‌గిరిలోనూ ఇదే ప‌రిస్థితి. పులివ‌ర్తి నానీని గెలిపించాలంటూ ఆయ‌న కోరిన సంగ‌తి తెలిసిందే. పుంగ‌నూరులో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై చ‌ల్లా బాబు పోటీ చేస్తార‌ని, ఆశీర్వ‌దించాల‌ని లోకేశ్ కోర‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ లోకేశ్ ప్ర‌క‌టించిన ఆరుగురు అభ్య‌ర్థుల్లో ఒక్క న‌గ‌రిలో మాత్ర‌మే గాలి భానుప్ర‌కాశ్‌కు సానుకూల అవ‌శాకాలున్నాయి. అది కూడా వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాల‌తో రోజాకు ఇబ్బందులు ఎదురు కావ‌చ్చ‌నే ప్ర‌చారం జరుగుతోంది. ఎన్నిక‌ల నాటికి న‌గ‌రి వైసీపీలో ఎలాంటి ప‌రిస్థితులు వుంటాయో చెప్ప‌లేం. న‌గ‌రిలో రోజాను గెలిపించాల్సిన బాధ్య‌త‌ను పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పెడితే మ‌ళ్లీ వైసీపీకి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డొచ్చు.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో లోకేశ్ ముందూవెనుకా చూసుకోకుండా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తుండ‌డం, అది కూడా బ‌ల‌హీన‌మైన నాయ‌కుల‌ను ఖ‌రారు చేస్తుండ‌డంపై ప్ర‌జ‌లు అవాక్కవుతున్నారు. లోకేశ్ ముంద‌స్తు ప్ర‌క‌ట‌న‌తో వైసీపీకి అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో  కావాల్సినంత స‌మ‌యం, నేత‌ల ఎంపిక‌కు మంచి అవ‌కాశం ఇస్తున్న‌ట్టైంది. ఇలా లోకేశ్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ పోతుంటే, చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా క‌స‌ర‌త్తు చేసేదేముంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

పుంగ‌నూరులో చ‌ల్లా బాబు లాంటి వీక్ క్యాండేట్‌ను ప్ర‌క‌టించి, అక్క‌డ తెలుగుదేశం జెండా ఎగురేయాల‌ని లోకేశ్ పిలుపు ఇస్తే లాభం ఏంట‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. లోకేశ్ ముంద‌స్తు అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌తో వైసీపీలో జోష్ పెరుగుతోంది. ఆల్రెడీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వారికే ఎక్కువ‌గా టికెట్లు ఇస్తార‌నే సంకేతాలు వెళ్లాయి. దీంతో మ‌ళ్లీ త‌మ‌కే అధికారం అనే న‌మ్మ‌కం, ధైర్యం వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల్లో క‌లుగుతున్నాయి. 

పాద‌యాత్ర‌లో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు లేదు, తొక్కా లేదంటూ టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల ఖ‌రారు, గెలుపుపై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతుండ‌డంతో టీడీపీ శ్రేణుల్లో అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది.