నిర్మాత దిల్ రాజు దృష్టి రాజకీయాల వైపు మళ్లుతోందా? నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారా? లేదా రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ మేరకు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దిల్ రాజుకు రాజకీయంగా చాలా పరిచయాలు వున్నాయి. ఆంధ్రలో వైకాపా నేతలతో బాంధవ్యాలు వున్నాయి. అందుకే మెలమెల్లగా తను కూడా రాజకీయాల వైపు మొగ్గుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకటి రెండు రోజుల క్రితం బలగం సినిమా ఫంక్షన్ కు మంత్రి కేటీఆర్ హాజరయిన దగ్గర నుంచి ఈ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. తరచు తెలంగాణ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించడం, నిజామాబాద్ ప్రాంతంలో అద్భుతమైన వెంకటేశ్వరస్వామి గుడి నిర్మించి, ఏటా భారీగా ఉత్సవాలు నిర్వహించడం ద్వారా దిల్ రాజు ప్రజలకు దగ్గరవుతున్నారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
దిల్ రాజు ఆసక్తి కనబర్చాలే కానీ, భారాస నుంచి టికెట్ తెచ్చుకోవడం మరీ కష్టం కాకపోవచ్చు. అలాగే ఆయనకు వున్న అంగ బలం, ఆర్థిక బలం, పార్టీ బలం కలిసి గెలుపు కూడా పెద్ద కష్టం కాదు. లేదా ఈ ఎన్నికలు తలకాయనొప్పి ఎందుకు అనుకుంటే రాజ్యసభ అన్నది మంచి ఆప్షన్ అవుతుంది.
ఏమైనా సినిమా రంగంలో తరచు వినిపించే దిల్ రాజు పేరు ఇప్పుడు మెలమెల్లగా రాజకీయ రంగంలో కూడా వినిపిస్తోంది. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలి.