వామపక్ష భావలు కలిగిన ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి ఈ మధ్య వైసీపీ సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం కి నిన్న మద్దతు గా మాట్లాడిన నారాయణమూర్తి తాజాగా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా జై కొట్టేశారు.
ముఖ్యంగా విశాఖను పాలనాపరమైన రాజధానిగా చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం దూరద్రుష్టితో తీసుకున్నదని ఆయన కొనియాడుతున్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనకబడిఉన్నాయని ఆయన అంటున్నారు.
వలసలు ఇక్కడ నుంచే మొదలై రాష్ట్రాలు, దేశాలు దాటి కూలీలుగా జనం పోతున్నారని ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా విశ్లేషించారు. దాన్ని అడ్డుకోవాలన్నా, ఈ ప్రాంతాలు ముందంజలోకి రావాలన్నా కూడా విశాఖలో రాజధాని ఉండాల్సిందేనని గట్టిగా వాదిస్తున్నారు.
జగన్ ఈ విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అంటున్నారు. ఇక పాలనాపరంగా ఒకే చోట కుప్పపోసిన హైదరాబాద్ అభివ్రుధ్ధి మోడల్ ఏపీకి మంచిది కాదని కూడా ఆర్ నారాయాణమూర్తి అంటున్నారు.
విశాఖవాసులకు మంచి రోజులు వచ్చాయని, ఈ నిర్ణయాన్ని అంతా సమర్ధించాలని కూడా ఆయన గట్టిగా కోరుతున్నారు. మొత్తానికి వామపక్ష పార్టీలు ఓ వైపు అమరావతి రాజధానిని ఉంచాలని కోరుతున్న నేపధ్యం ఉంది.కానీ వామపక్ష భావజాలం పట్ల సానుభూతి ఉన్న ఆర్ నారాయణమూర్తి మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించడం అంటే ఆయన ప్రజాకోణంలోనే తరచూ స్పందిస్తున్నారనుకోవాలి.
ఏది ఏమైనా టాలీవుడ్లో టాప్ స్టార్స్ అంతా ఏపీ విషయంలో పట్టనట్లుగా ఉంటే నారయాణమూర్తి సినిమాలే కాదు, దైనందిన రాజకీయల పట్ల స్ప్రుహతో ఎప్పటికపుడు తనదైనశైలిలో ప్రజా గొంతుకను వినిపించడం పట్ల అంతా స్వాగతిస్తున్నారు.