ఫ్యాన్స్ తో మహేష్ బాబు ఫొటోషూట్ అంటూ నిన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన కార్యక్రమం రసాభసగా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ను అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట జరిగి ఇద్దరి కాళ్లు విరిగాయి. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాల్ని స్వయంగా మహేష్ అభిమానులే బయటపెట్టారు.
ఫొటోషూట్ కోసమని పిలిచి బౌన్సర్లతో కొట్టించారని ఆరోపిస్తున్నారు కొంతమంది మహేష్ ఫ్యాన్స్. ఉదయం 5 గంటల నుంచి క్యూలో నిల్చుంటే, మధ్యాహ్నం 3 గంటల సమయానికి, సరిగ్గా దగ్గరకొచ్చే టైమ్ కు బౌన్సర్లు తన్ని తరిమేశారని బాధపడ్డారు. అభిమానులమనే కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. యూనిట్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్టు, మరికొంతమంది ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మహేష్ తో సెల్ఫీకి 500 రూపాయలు అంటూ వేదిక వద్ద డబ్బులు వసూలు చేసినట్టు చెబుతున్నారు. అయితే నిజానికి యూనిట్ సభ్యులు ఎవరూ ఇలా చేయలేదు, ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ఇలా మోసపూరితంగా వ్యవహరించి.. అమాయకుల వద్ద 500 రూపాయలు వసూలు చేశారు. మరికొంతమంది మోసగాళ్లు.. బారికేడ్లు దాటించి మహేష్ ను షార్ట్ కట్ లో కలిసే ఏర్పాటుచేస్తామంటూ ఏకంగా వెయ్యి రూపాయలు కూడా వసూలు చేశారట.
ఇలా ఫ్యాన్స్ తో ఫొటో షూట్ అంటూ పెట్టిన కార్యక్రమం అస్తవ్యస్తం అయింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే నిన్నటిలా ఇబ్బందులు, అపోహలు లేకుండా ఉండేందుకు.. పాస్ లు పంచారు. పాస్ ఉన్నవాళ్లకు మాత్రమే ఫొటో అన్నమాట. నిన్నటి పాసులు చెల్లవని కూడా స్పష్టంచేశారు. ఎవ్వరికీ ఎలాంటి డబ్బు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈమధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అభిమానులతో ఫొటోలు దిగారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. చెన్నైలో ఓ ఇండోర్ స్టేడియం తీసుకున్నారు. అందరికీ తేదీ, సమయం రాసిచ్చారు. వచ్చిన వాళ్లకు భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఫ్యాన్స్ అంతా రజనీకాంత్ తో ఫొటో దిగి వెళ్లారు. టాలీవుడ్ సూపర్ స్టార్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది.