ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావుని మొదటి సారి కలిసిన మాడా వెంకటేశ్వరరావు డైలాగొకటుంది- “సెపెరేషన్ కి ఎంతవుద్ది? కాలేజీ సీటుకి ఎంతవుద్ది? మర్డరుకెంతవుద్ది? ప్రెసిడెంట్ సీటుకెంతవుద్ది? ..కన్సెషన్ ఏమైనా ఉందా?” అని.
ఇప్పుడు తెలుగు సినిమా ఆస్కారు స్థాయికి వెళ్లిందంటే రాజమౌళి కూడా అక్కడి మీడియా వాళ్లతో ఈ విధంగా బేరమాడి ఉండాలి- “ఇంటర్వ్యూకి ఎంతవుద్ది? రివ్యూకి ఎంతవుద్ది? గొప్ప సినిమా అని రాయడానికెంతవుద్ది? సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్లకి ఎంతవుద్ది? హోలు మొత్తానికి కన్సెషనేమైనా ఉందా?”.
సరదాగా చెప్పుకున్నా తెలుగు సినిమాని ఆస్కారు స్థాయికి తీసుకువెళ్లడం అంత హర్రీబుర్రీగా తేలిన వ్యవహారం కాదు.
అడుగడుగునా లక్షల్లో ఖర్చు. ఒక సగటు అమెరికన్ పత్రికలో ఆర్టికల్ అచ్చు వేయాలంటే అయ్యే ఖర్చు అక్షరాలా మూడున్నర లక్షలు. సైజును బట్టి వాటిల్లో లెక్కలు మారతాయి. అక్కడ ఎంత ఖర్చు పెడితే అంత పబ్లిసిటీ. ఇండియాలో డబ్బు తీసుకుని ఆర్టికల్ అచ్చు వేస్తే పెయిడ్ ఆర్టికల్ అని మనవాళ్లు చిన్నచూపు చూస్తారు కానీ అమెరికాలో జరిగేది పూర్తిగా అదే. అక్కడ ఒక్క అక్షరం కూడా ఊరికే రాదు.
ఆ మాధ్యన తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో బాలీవుడ్ మీడియా-నెట్ ని ఆశ్రయించారు తెలుగు సినిమా వాళ్లు. ఆ విధంగా ఇక్కడి నటీనటులు బాలీవుడ్ మీడియా ద్వారా బాలీవుడ్ సర్కిల్స్ లో గుర్తింపుని కొనుక్కున్నారు, కొనుక్కుంటూ ఉన్నారు. దాని వల్ల తెలుగు సినిమా పరిధితో పాటూ సినిమా పబ్లిసిటీ ఖర్చు పెరుగుతూ వెళ్ళింది. ఆ భారమంతా నిర్మాతల మీదే. ఇప్పుడది అంతర్జాతీయ స్థాయికి పాకింది రాజమౌళి చొరవ వల్ల.
ఎన్.టి.ఆర్ కి, రాం చరణ్ కి రాజమౌళి దయవల్ల ఆ స్థాయి ఆస్కార్ ప్రచారం లభిస్తే అల్లు అర్జున్ సైలెంటుగా ఊరుకుంటాడా? కచ్చితంగా “పుష్ప-2” నిర్మాతల మీద అమెరికన్ పబ్లిసిటీ భారాన్ని కూడా మోపుతాడు. తానూ ఆస్కార్ బరిలో ఆటకి దిగుతాడు. కనీసంలో కనీసం రూ 100- 120 కోట్ల రూపాయలు ఆ నిర్మాతలు కేవలం అమెరికన్ పబ్లిసిటీ కోసం పక్కన పెట్టాల్సిన ఒత్తిడి ఏర్పడుతుంది.
ఇప్పటికే “పుష్ప-2” ని వెయ్యి కోట్లకి అమ్మే దిశగా పావులు కదులుతున్నాయని సమాచారం. అంటే ఆర్.ఆర్.ఆర్ హక్కుల అమ్మకాలు రూ550కోట్ల దగ్గర ఆగితే దానికి రెండింతలు వ్యాపారం చెయ్యాలన్నది టార్గెట్. డబ్బుల పరంగా నిర్మాతల మీద, క్వాలిటీ ప్రొడక్ట్ పరంగా సుకుమార్ మీద భయంకరమైన ప్రెజర్ ఉంటుందిప్పుడు.
అది అలా చెయిన్ రియాక్షన్ లాగ ప్రతి స్టార్ హీరో సినిమాకి పాకుతుంది. ప్రభాస్ సినిమాలు కూడా ఆ మార్గంలో క్యూ కడతాయి. సినిమా నిర్మాణాలు వందల కోట్లల్లో జరుగుతూ, వ్యాపారం కూడా వందల కోట్లల్లో అవుతున్నప్పుడు ఒక వంద కోట్లు పక్కన పెట్టి ఆస్కార్ ఆట ఆడడం ఇక రివాజైపోతుంది. రాజమౌళి రూ 70-80 కోట్లతో ఆ ఫీట్ ని చేసి దారి వేయడమే దీనికి మూలం.
ప్రస్తుతానికి తెలుగు సినిమా పాట ఆస్కార్ గుమ్మం తొక్కేసింది. భవిష్యత్తులో హీరోలకి, దర్శకులకి, సినిమాలకి కూడా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మనవాళ్లు పట్టువదలకి విక్రమార్కులు, పోటీ తత్వం విపరీతంగా ఉన్నవారు. హాలీవుడ్ తర్వాత ఆస్కార్ పట్ల అంతటి వేలంవెర్రి చూపించే గుణం కొరియావాళ్లకన్నా మనవాళ్లకే ఎక్కువుండొచ్చు.
ఆర్.ఆర్.ఆర్ ని ఆస్కార్ స్థాయిలో నిలబెట్టడానికి రాజమౌళి చేసిన ప్రయత్నాలని తొలుత చిన్నచూపు చూసిన మాట వాస్తవం. కానీ సాధించాడు కాబట్టి అతన్ని మనసారా కొనియాడాలి. పైగా ఆస్కార్ ఊరికే రాదు అనేది కూడా వాస్తవం. కనుక ఏ మార్గంలో వెళ్తే ఆస్కార్ కి ఆస్కారముంటుందో ఆ ఒక్క మార్గంలోనే వెళ్లాడు రాజమౌళి. మగధీర సినిమాలో శ్రీహరి ముందుగా రాం చరణ్ శక్తిని చాలా తక్కువ అంచనా వేస్తాడు. కానీ అతను వందమందిని ఓడించడం చూసి నెవ్వెరపోయి మోకరిల్లుతాడు. ఎవెవెరవరైతే రాజమౌళిని అలా తక్కువంచనా వెశారో వాళ్లంతా ఇప్పుడు రాజమౌళి ముందు మోకరిల్లి జైకొట్టాల్సిందే…ఈ వ్యాసకర్తనైన నాతో సహా!
గుడ్లవల్లేటి వెంకటసుబ్రహ్మణ్యం