మాననీయ ప్రజా నాయకుడు, జనసేనాని, ప్రజలలో ఆరుశాతం ఓటు బ్యాంకు బలం ఉన్న అధినాయకుడు పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దయతలిచారు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం అని ఆయన వెల్లడించారు. ఈ రెండు రోజుల పాటూ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయం అని ఆయన ప్రకటించారు. అక్కడికేదో.. ప్రభుత్వానికి తాను చాలా పెద్ద మేలు చేస్తున్నట్టు కూడా పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టున్నారు.
పవన్ కల్యాణ్ కు తన గురించి తనకు అతివిశ్వాసం ఉంటుంది. ప్రతిసందర్భంలోనూ ఆయన ఇలాంటి అతిని ప్రదర్శిస్తుంటారు. తాను గానీ ఒక్క యీల గానీ వేశానంటే.. కోట్ల మంది జనసైనికులు వెల్లువెత్తి వైఎస్సార్ కాంగ్రెస్ ను ముంచెత్తేస్తారని చాలా బహిరంగ సభల్లో ఆయన ఆర్భాటపు ప్రకటనలు చేస్తుంటారు. ఇలాంటి మాటలన్నీ కూడా తన గురించి తనకు అతి విశ్వాసంతో వచ్చే మాటలు తప్ప మరొకటి కాదు. అదేతరహాలో ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు గురించి కూడా పవన్ తన బలాన్ని తాను అతిగా అంచనా వేసుకుంటున్నారు.
ఈ రెండు రోజుల పాటు తాను ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉంటానని అంటున్నారు. అక్కడికేదో.. ఈ రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ నుంచి ప్రభుత్వం అవినీతి మీద ఒక పడికట్టు విమర్శలు వినిపించగానే, వాటిని నమ్మేసి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు వెంటనే తిరుగు ప్రయాణం టికెట్లు బుక్ చేసుకుని వెనక్కు వెళ్లిపోతారని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది.
నిజంగానే జగన్ నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం అయితే గనుక్.. ఇన్వెస్టర్లు ఇలాంటి గాలివాటు నాయకుల విమర్శలను ఖాతరు చేయరు. ఇన్వెస్టర్లు పరిగణించే ప్రమాణాలు వేరే ఉంటాయి. వాటిని ముందుగా పరిశీలిస్తారు. వాటికి తగ్గట్టుగా రాష్ట్రంలోర పరిస్థితులు ఉంటే మాత్రమే పెట్టుబడి పెడతారు, లేకుంటే లేదు.
ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పోకడల ఎలా ఉంది, వారి విమర్శలు ఎలా ఉన్నయో పట్టించుకునే పారిశ్రామికవేత్తలు ఉన్నా కూడా.. సమిట్ జరిగే రెండు రోజులు మాత్రమే కాదు.. దానికి ముందు వెనుక కొన్ని నెలల పాటూ రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలను అధ్యయనం చేసి, వాటిలో ఎన్ని సంకుచితమైనవో, ఎన్ని నిజమైన విమర్శలో బేరీజు వేసుకుని పెట్టుబడులు పెడతారు. అంతే తప్ప.. రెండురోజుల విమర్శలతో పరిస్థితి మారిపోతుందనుకుంటే భ్రమ.
కాబట్టి పవన్ కల్యాణ్ రెండురోజులు తమ పార్టీ ప్రెస్ రిలీజు లు ఇవ్వకుండా సెలవు తీసుకోవడానికి, ప్రభుత్వానికి ఫేవర్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం చిల్లరగా ఉంది.