రూపకంతా అయోమయంగా ఉంది. కొద్దిసేపట్లో భర్త రాజా వచ్చేస్తాడు. అతని ఎదుటపడడం ఎలా? అక్కయ్య ఇందిర కూడా సెలవు పెట్టి ఇంట్లోనే వుంది. ఆమె ఎదుట తను భర్త కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకోగలదా? వేడుకుంటే అక్కయ్య చూస్తూ ఊరుకుంటుందా?
ఇందిరక్కయ్య చెట్టంత మనిషి. చెట్టులాగే తనకు ఆశ్రయం ఇచ్చింది. చిన్నప్పటినుంచీ తల్లీ, తండ్రీ తనే అయి పెంచింది. అవును, తండ్రిలా కూడా! చాలామంది మగాళ్లను తలదన్నే మగరాయుడు అక్కయ్య, ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలదు. తన పదిహేనవ ఏట పడవ ప్రమాదంలో తల్లీ, తండ్రీ చచ్చిపోతే ఆరేళ్ల పసికందు తనను చంకనేసుకుని మేనమామల ఇల్లు చేరింది. అక్కడ కష్టనష్టాలు భరించి తెలుగు పండిట్ కోర్సు పాసయి టీచరుద్యోగం చేస్తూ తన పొట్ట పోసుకుంటూ, తనని సాకుతూ విద్యాబుద్ధులు చెప్పించింది.
తండ్రి ఆస్తిని మేనమామ కాజేస్తే కోర్టుకెక్కి వ్యాజ్యం నడిపి ఆస్తి స్వాధీనం చేసుకుని దానితో తనను ఒకింటిదాన్ని చేసింది. అక్కయ్య లేకపోతే తను ఎప్పుడో చచ్చిపోయి వుండేది. ఒక వేళ బతికున్నా ఏ బిచ్చగత్తెగానో, బొంబాయి రెడ్‌లైట్ ఏరియాలో వేశ్యగానో అయివుండేది. అందుకే తను అక్కయ్యను ఒక దేవతలా చూస్తుంది. తను ఏం తినాలన్నా, ఏం కట్టుకోవాలన్నా, ఏం చెయ్యాలన్నా అక్కయ్య చెప్పాల్సిందే. ఊపిరి పీల్చడం కూడా అక్కయ్య నడిగి చేయాల్సిందే. అలాగే ఆవిడకీ అలవాటయింది, తనకూ అలవాటయింది.
పెళ్లయ్యేంతవరకూ ఇది బాగానే నడిచింది కానీ పెళ్లయ్యాకే చికాకులు తలెత్తాయి. తనను శాసించడానికి మరో వ్యక్తి, భర్త రాజా-తయారవవ్వడం అక్కయ్య సహించలేకపోయింది. తను కట్టుకోవాల్సిన చీర దగ్గర్నుంచీ భర్తకూ, అక్కయ్యకూ వేరేవేరే అభిప్రాయాలుండేవి. వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు కారు. ‘ఆవిడ్ని చూస్తే నాకు భయం’ అనేవాడు రాజా. ‘అలా మెలికలు తిరిగిపోతూ భయపడే మొగాళ్లంటే నాకసహ్యం’ అనేది అక్కయ్య. మధ్యలో తను నలిగేది. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా అక్కయ్య అర్థం చేసుకోదు.
పెళ్లికి ముందు అక్కయ్యా, తనూ ఒకే మంచం మీద పడుకోవడం అలవాటు. పెళ్లయ్యాక ఈ ఇంటికి మారేక ముందు గదిలో అక్కయ్యా, మధ్యగదిలో తనూ, రాజా పడుకోవడం మొదలెట్టారు. అక్కయ్య ఒక్కత్తికీ నిద్రపట్టేది కాదు. ముప్ఫయి అయిదేళ్ల అలవాటు అంత త్వరగా ఎలా పోతుంది? ‘రోజూ మొగుడి దగ్గరే పడుకోవాలా? అప్పుడప్పుడు నా దగ్గిర పడుకోవచ్చుగా?’ అనేది. తను రాజా దగ్గర అని చూసింది. ‘ఆవిడ వ్యవహారం చాలా వింతగా వుంది. పెళ్లి చేసుకోకుండా కన్యగా మిగిలితే ఇలాగే వుంటుంది' అంటూ తిట్టిపోశాడు. అక్కయ్య పెళ్లి మాట తలపెట్టలేదు. ఆవిడకి మగాళ్ల మీద సదభిప్రాయం లేదు. తనని కూడా చాలాసార్లు అడిగి చూసింది- ‘పెళ్లి చేసుకుని మొగుడికి ఊడిగం చేస్తావా? పెళ్లి మానేసి దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటావా?’ అని. ‘ఇల్లాలిగా ఉండడమే తనకిష్టం' అని చెప్పాక ‘నీ ఖర్మం’ అని నుదురు కొట్టుకుని పెళ్లి చేసింది.
నిజంగానే పెళ్లి ‘ఖర్మం’గానే దాపురించింది. ఈయన ఇంటికి లేటుగా వచ్చేవారు. అదేమంటే ‘ఆఫీసులో పని’ అనేవారు. ‘అదేంకాదు, ఊళ్ళో ఆడాళ్లతో తిరుగుతూండవచ్చు, మగాళ్లంతా ఇంతే. మా కొలీగ్స్ కూడా చెప్తుంటారుగా. ‘ఇంట్లో వున్న పెళ్లాం ఎక్కడికీ పోదన్న ధీమాతో పరాయింటి ఆడాళ్లను ఎంతమందిని అనుభవిస్తే అంత గొప్ప ఈ మగాళ్లకి. గట్టిగా నిలదీసి అడుగు’ అని ఉద్బోధించేది అక్క. అక్క సలహా మేరకు ఆలస్యంగా వచ్చిన రోజున మొగుణ్ణి పక్కలోకి రానిచ్చేదికాదు. వెళ్లి అక్క దగ్గరే పడుకొనేది. ‘‘మీ అక్క నీ బుర్ర చెడగొడుతోంది. మొగుడూ మొద్దులూ లేనివాళ్లు కొంపలో వుంటే ఇలాగే వుంటుంది. శరీరపు ఆకలి అర్థం చేసుకోలేక, తక్కినవాళ్లది చాపల్యం అనుకుని, వాళ్లను సుఖంగా ఉండనివ్వరు. పాత తెలుగు సినిమాల్లో చూడలేదూ?’’ అంటూ ఎగిరి పడేవాడు రాజా.
‘‘ఆవిణ్ణి పల్లెత్తు మాటంటే నేనూరుకోను. నన్ను కళ్లల్లో పెట్టుకు చూసింది. మీలా నిర్లక్ష్యం చేయలేదు’’ అని పోట్లాడేది తను. రాజాకు కోపం ఎక్కువ. మగవాడనే అహంభావమూ ఎక్కువే. ‘మొగుణ్ణి ఇన్ని ఆరాలు అడుగుతావా?’ అంటూ విరుచుకు పడేవాడు. అక్కయ్య దన్నుతో తను ఎదిరించి మాట్లాడితే చెయ్యి చేసుకునేవాడు. తన ఒంటిమీద దెబ్బలు చూస్తే చాలు అక్కయ్య శివాలెత్తిపోయేది. “నువ్వు సుకుమారంగా ఉన్నావని చావగొడుతున్నాడు. నేను ఒక్కటిచ్చానంటే గింగరాలు తిరుగుతూ పడతాడు, ఆడంగి వెధవ. పెళ్లాన్ని ఏలుకోవడం చేతకాదు, కొట్టడమొకటీ. నీకేం ఖర్మ పట్టలేదు. విడాకులు ఇచ్చేస్తాను పొమ్మనమను. పిల్లా పీచూ పుట్టలేదుగా, నాలాగే దర్జాగా, ఎవరికీ తలవంచకుండా బతుకుదువుగాని, మనకు బంధువులు ఎప్పుడో దూరమయ్యేరు. కూపీ లాగి వచ్చి అవమానం చేసేందుకు ఎవరూ లేరు.’’ అనేది.
తను అక్కయ్య మద్దతుతో విరుచుకుపడేది. రాజాకు ఆవేశం ఎక్కువ. ఎదుటివాళ్ల బాధ నర్థం చేసుకొని వాళ్లను ఒప్పించే స్వభావం లేదు. ‘తను చేసేది రైటు. అడగడానికి వీళ్లెవరు?’ అనుకొనే రకం. అక్క పోరు భరించలేక ఓ రోజు తను విడాకుల మాటెత్తగానే ‘ఆడదానికి నువ్వే విడాకులడిగినప్పుడు, మొగాణ్ణి నేను వెనకాడ్డమేమిటి? ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇల్లు దొరగ్గానే వచ్చి సామాను పట్టుకుపోతాను. లాయరు దగ్గరకెళ్లి కావలసిన కాగితాలు పట్టుకొచ్చి యిస్తా. సంతకాలు పెట్టేయి. ఇక రచ్చకెక్కకుండా విడిపోదాం. నువ్వూ, మీ అక్కయ్య కట్టగట్టుకుని ఊరేగుదురుగాని..’ అని విసవిసా ఇంట్లోంచి వెళ్లిపోయేడు. అలా అయిదు నెలల తన కాపురం అంతరించిపోయింది.
రాజా వెళ్లిపోయిన తర్వాత చూస్తే తన పొరపాటూ ఉందేమో ననిపించింది. రాజా తనను ప్రేమగానే చూసుకొనేవాడు. ఇతర ఆడవాళ్లతో అతను తిరిగినట్టు తను చూసినదీ లేదు, విన్నదీ లేదు. ఇంటికి ఆలస్యంగా రావడానికి అతనికి వేరే కారణమేదైనా వుందేమో. తను ప్రేమగా అడిగి ఉంటే చెప్పేవాడేమో! నిలదీసి అడిగేసరికి పౌరుషం పొడుచుకొచ్చింది. ‘చెప్పను పొమ్మ’న్నాడు. తెగేదాకా లాగితే తెంపేసుకుని వెళ్లాడు. ఇవాళ వచ్చి బట్టలు పట్టుకెళతానని కబురెట్టాడు. అతను ఎదురుపడితే సంబాళించుకోలేదు. కాళ్ల మీద పడి చేరదీయమని బతిమాలుతుందేమో తనకే తెలియదు, అలాటిది జరక్కుండా చూడడానికే అక్కయ్య స్కూలు మానేసి, ఇంట్లో కూచుంది. ఆవిడని కాదని తను మొగుడితో వెళ్లిపోగలదా? తనే సర్వస్వంగా బతుకుతున్న అక్కయ్యకు ద్రోహం చేసినట్టు కాదూ?
రూపకు అయోమయంగా వుంది. చివరికి తోచినదేమిటంటే – భర్త, అక్కయ్య ఇద్దరూ రెండు పొట్టేళ్ల లాటివాళ్లు. వాళ్ల మధ్య తనలాటి బక్కజీవి ఉండడం సాధ్యంకాదు. భర్త వచ్చే టైముకు తను ఎక్కడికైనా వెళ్లిపోతే సరి. ఆ పరిస్థితిని అక్కయ్య ఎలా ఎదుర్కొంటే తనకేం? తనక్కడ లేకుండా వుంటేనైనా వాళ్లిద్దరూ బలాబలాలు తేల్చుకుంటారేమో! దేవుడే ఒక దారి చూపిస్తాడు. ఊరికి పదిహేను మైళ్ల దూరంలో వున్న సాయిబాబా మఠానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తానంది రూప. ఇందిర సరే వెళ్లిరమ్మనమంది.
రాజా రిక్షాలో దిగేడు. ఒక గంట పోయేక బండి ఏదైనా వెంటబెట్టుకు రమ్మనమని పంపించేశాడు. ముందు గదిలో వదినగార్ని చూసి మొహం చిట్లించి, ‘‘రూప లేదా?’’ అన్నాడు కాఠిన్యం తెచ్చిపెట్టుకుని.
“రూపెందుకూ? మీ బట్టలూ, సామాన్లు ఉన్నాయిగా. ‘పాక్’చేసి పట్టుకెళ్లండి’ అంది ఇందిర తల ఎగరేసి.
రాజా పళ్లు నూరుకుంటూ ఇందిర కేసి పరీక్షగా చూసేడు. బెంచిమీద ఒక కాలు కిందకు వేలాడేసి కూచుంది. మరొకటి మడిచి పెట్టుకుని ఉంది. అలుకుగుడ్డలాటి చీర. కట్టుకున్నట్టు లేదు. చుట్టబెట్టుకున్నట్లు ఉంది. లూజు జాకెట్టు. పైట అస్తవ్యస్తం. తల దువ్వుకోలేదు. వక్క కాబోలు, ఏదో నములుతోంది. పై పెదవి మీద సన్నటి వెంట్రుకల బారు, చెంపల దగ్గర కిందకు దిగిన వెంట్రుకలు, దట్టమైన కనుబొమ్మలు. మొహాన్న బొట్టు సెంటర్లో లేదు. ఒంటిమీద ఒక్క నగలేదు. తన కంటె రెండంగుళాలు పొడుగైన శరీరం, దానికి తగ్గ లావు. తనను చూశాక నువ్వంటే నాకేం ఖాతరు లేదని చూపించడానికి బెంచి బద్ద మీద కాలు అన్చి ఊపుతుండడంతో ఒళ్లంతా వదులు వదులుగా ఊగుతోంది. ‘మహాతల్లి! దీనిలో ఆడతనం ఏ కోశానా లేదు. ఇంకో ఆడదాని కాపురం కూల్చడానికి ఎందుకు సంకోచిస్తుంది? రూప ఉంటే, తను విడాకులు వద్దంటే, కాపురం నిలబెట్టుకొందామనే వచ్చాడు తను. ఈ దెయ్యం ఆమెను ఎక్కడికో పంపేసి ఉంటుంది. ఇది దూరమయ్యేదాకా రూప తనకి దగ్గరవ్వదు. అది జరగదు.’ అనుకుని తన పనిలో పడ్డాడు.
అరగంటసేపు పోయాక రాజా ప్యాకింగ్ ఎంతవరకూ వచ్చిందో చూడడానికి వెళ్లింది ఇందిర. రూప బీరువా లోంచి ఓ చీర తీసి గుండెలకి హత్తుకుంటున్నాడు రాజా, అది తన పెట్టెలో పడేయబోయాడు. ‘‘అది రూప చీర. మీరెలా పట్టుకెళతారు?’’ అంటూ వచ్చి చీరమీద చెయ్యి వేసింది. ‘‘నేను తనకు మొదటిసారిగా పెట్టిన చీర. అందుకని అదొక్కటీ పట్టుకెళుతున్నాను.’’ ‘‘మీరు కొంటే మాత్రం! మీరు యిచ్చేశాక దానిదే కదా! పట్టుకెళ్లి ఏం చేస్తారు? మీ గర్ల్‌ఫ్రెండ్ కిస్తారా? ఎందుకొచ్చిన కబుర్లుగానీ, బీరువాలో పెట్టేవయ్యా’’ అంది ఇందిర మొరటుగా,
వస్తున్న కోపాన్ని అణచుకుంటూ రాజా “చూడండి, నేనసలే ఎమోషనల్‌గా డిస్టర్బ్‌డ్‌గా ఉన్నాను. అనవసరంగా మాట్లాడించకండి. కాపురం కూలిపోయినది నాది, మీది కాదు. నాకు గర్ల్‌ఫ్రండూ లేదు, బాయ్‌ఫ్రెండూ లేడు. లేనిపోనివి చెప్పి రూపను నాకు దూరం చేశారు. నేను ఒక్క చీర తీసుకుంటున్నాను. అదీ పట్టుచీర కాదు. మూడొందల రూపాయల చీర….” అన్నాడు.
“చీర ఖరీదు ఎంతని కాదు ఇక్కడ కొశ్చిన్. అదే అక్కర్లేనప్పుడు దాని చీరెందుకని అడుగుతున్నాను. ఇంకోమాట. రూప కాపురం కూల్చింది నేను కాదు. నువ్వు కూలదోసి వెళ్లిపోతూంటే దానికో మార్గం… భుక్తి గడిచే దారి చూపిస్తున్నది నేను. వచ్చే నెలలో మా స్కూల్లో దాన్ని పార్ట్‌టైమ్ టీచర్‌గా వేయిస్తున్నాను. ఇప్పుడు చెప్పు ఎవరికుందో ప్రేమ?” “మొగుడితో సంసారం చేయనిస్తే ఈ ఉద్యోగానికి వెళ్ళే అవసరం తనకి పట్టేది కాదు. అదంతా నాకెందుకు? నాకు ఈ చీర సెంటిమెంటల్‌గా ముఖ్యం. నన్ను తీసుకోనిస్తారా? లేదా?”
మొగవాళ్లు సెంటిమెంటు గురించి మాట్లాడితే ఇందిరకు ఆశ్చర్యం వేసింది. మగాళ్లకి కూడా సున్నితమైన అనుభూతులు ఉంటాయని ఆమెకు ఎన్నడూ తట్టలేదు. వాళ్లకు కావలసినది మాంసం మాత్రమే అని ఆమె దృఢాభిప్రాయం. మేనమామ పంచన చేరినప్పుడు, చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆయన తనపై అత్యాచారం చేయబోయినప్పటి నుంచీ ఆమెకు మగవాళ్ల మీద ద్వేషం. ఆమె కొలీగ్స్ కూడా మొగుడితో పోట్లాటల గురించే స్కూల్లో చెప్పేవారు కానీ, వాళ్ల ప్రేమ ఘట్టాలు చెప్పేవారు కారు. తెలుగు పండిట్ కోర్సులో ఆమె చదువుకున్న పద్యకావ్యాల్లో కూడా ప్రబంధ నాయకులందరూ స్త్రీల వక్షోజాల గురించీ, కటి వలయాలను గురించి, భూరినితంబాల గురించి వర్ణించారు కానీ మనసున్నట్టు ఎక్కడా ప్రవర్తించలేదు. కదనరంగం, మదనరంగం తప్ప ఇలాటి సుతారమైన విషయాలు వారిని కదిలిస్తాయని ఆమె ఎన్నడూ అనుకోలేదు.
ఆమె పాఠం చెప్పవలసి వచ్చే కావ్యాల్లో నాయకులు ఒక్కొక్కళ్లూ ముగ్గురేసి రాకుమార్తెలను పెళ్లాడేవారు. ప్రతీ వారితోనూ అవే సరససల్లాపాలు. అవే చంద్రోపలంభనాలు. అవన్నీ విడమరిచి మాటకు మాట అర్థం స్టూడెంట్సుకు చెప్పడం వెగటుగా ఉండేదామెకు. మగవాడు వేటి గురించి పడిఛస్తాడని తెలిసిందో, వాటినే గాలికి వదిలేసినట్టు తిరిగిందామె తిక్కకొద్దీ. ‘ఎవడైనా గుడ్లప్పగించి చూసుకోనీ, నాకేం భయమా, దగ్గరకొస్తే గుడ్లు పీకుతా’ అన్నట్టు ప్రవర్తించేంది.
ఆమె భారీ ఆకారం, పొగరుబోత్తనం చూసి ఎవడూ ధైర్యం చేయలేదు. దగ్గరకు వచ్చి నైస్‌గా మాట్లాడినదీ లేదు. అందువల్ల ‘ఈ ప్రేమలూ, సెంటిమెంట్లూ బోగస్’ అనే నిర్ణయానికి వచ్చిందామె. మొగాడికి కావల్సింది సెక్స్. ఆడదానికి అదీ అక్కర్లేదు. గట్టిగా తలచుకొంటే, తనలా ఒంటరిగా, బోర విరుచుకుని బతకగలదు..’ ఇదీ ఆమె నిశ్చితాభిప్రాయం. అందుకే “మొగాడికి సెంటిమెంట్సు ఉంటాయని కొత్తగా వింటున్నాను' అంది వెటకారంగా. ‘‘అది మీ దురదృష్టం. మొగాడంటే ఏమిటో తెలిసున్నవాళ్లు మీలా ప్రవర్తించరు’’ అన్నాడు రాజా ఆమెను ఎగాదిగా చూస్తూ. చీర కుచ్చిళ్లు పైకి పెట్టడంతో ఆమె పిక్కలు కనబడుతున్నాయి.
ఇందిర కిందకు చూసుకున్నా ఖాతరు చేయలేదు. దుస్తులు సరిచేసుకోలేదు. “నాకు చాలా మంది మొగాళ్లు తెలుసు. కాచి వడపోశాను. కాబట్టే నీ తిరుగుళ్లు వెంటనే కనిపెట్టగలిగేను” అంది బింకంగా, కావాలని ఏకవచనాన్ని ఒత్తి పలుకుతూ, రాజా తగ్గలేదు. ‘‘అబద్ధం! నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు ఒక్క మగాడితో కూడా ‘ఇంటిమసీ’ లేదు. జీవితంలో ఒక్కసారి సెక్స్ అనుభవించినా నువ్వు మరోలా ఉండేదానివి. నువ్వు సుఖపడి, ఇంకొకరు సుఖంగా బతికేట్లు చేసేదానివి. ఇతరుల సుఖాన్ని కాలరాసే దానివి కావు’’. అని గట్టిగా అన్నాడు. ఇందిర అహం దెబ్బతింది. ‘‘ఏమిటయ్యా, పెద్ద గొప్పగా చెపుతున్నావ్! సెక్స్ అంటే ఇద్దరూ కలసి పొర్లడమే. ఆ అనుభవం ఉంటేనేం? లేకపోతేనేం?’’ అని అరిచింది.
‘‘అదే మరి… అనుభవిస్తే తెలిసేది, పక్షుల దగ్గర్నుంచీ, పశువుల దగ్గర్నించీ జతకట్టడానికి ఎందుకు తహతహలాడతాయో, దాని కారణంగానే ఇద్దరు వ్యక్తులు మధ్య ఎన్ని భేదాభిప్రాయాలున్నా కలిసి మెలసి ఉండగలుగుతున్నారని అర్ధమయ్యేది.” ‘‘నువ్వన్నావు చూడు, పశులక్షణమని, అది కరెక్ట్. ఆది పశువులు చేసే పని. మనుషుల మధ్య ‘ప్లెటోనిక్ లవ్’, అమలిన శృంగారం ఉంటే చాలు’’ అంది ఇందిర నిరసనగా. రాజాకు విసుగొచ్చింది. కోపం తమాయించుకుని, ‘‘సృష్టికార్యాన్ని యీసడిస్తే సృష్టికర్తను అవమానించినట్లే. జీవితంలో సెక్స్ అనుభవం లేని మీతో దాని గురించి వాదించడం నాదీ బుద్ధితక్కువ. నా పని నన్ను చూసుకోనివ్వండి” ఆంటూ వంగి పెట్టెలో బట్టలు సర్దుకోబోయాడు.
అతనలా తీసి పారేయడంతో ఇందిరకు చివ్వున కోపం వచ్చింది. వెళ్లి అతన్ని భుజాలు పట్టుకుని పైకి ఎత్తి “ఏంటయ్యా? సెక్స్ గురించి అంత ఇదిగా చెప్తావ్! రా, అదేమిటో చూపించు. నేను రెడీ’’ అంటూ ఎదురుగా నిలబడి పైట కిందకు జార్చేసింది. రాజా ఆమె మీద పడి వాటేసుకోలేదు. కళ్లప్పగించి ఆమె భారీ శరీరాన్ని చూసేడు. “చూడండి, మిమ్మల్ని వాదనలో ఓడించడానికి రాలేదు నేను. ఇప్పటికే రూపెవరో, నేనెవరో అయిపోయాం. రూపే నా భార్య కానప్పుడు, మీరు నాకు వదినగారు కారు. మీరు దేని గురించి ఎలా అభిప్రాయపడినా అది నన్నే విధంగానూ ఎఫెక్ట్ చేయదు. నాకెందుకీ పరీక్ష? మీరు వెళ్లి ముందు గదిలో బెంచీ మీద కూర్చోండి. చాలా రోజులుగా స్త్రీసుఖం లేకుండా ఉన్నాను. కాస్సేపు మీరలాగే నిలబడితే నా నిగ్రహం చెడవచ్చు’’ అన్నాడు వణుకుతున్న గొంతును అదుపులో పెట్టుకుంటూ.
కానీ ఇందిర కదలలేదు. తొడమీద చెయ్యివేసి “పిరికిపందలా మాట్లాడకు. ఛాలెంజ్ చేస్తున్నాను. రా. శృంగారంలో ఆనందం ఉందని నాకు నిరూపించు. నేను కన్విన్సయితే రూపకి చెప్పి మిమ్మల్నిద్దరినీ కలుపుతాను. అది నా మాట జవదాటదు. లేదా, నువ్వు చెప్పేవన్నీ బూటకం మాటలని ఒప్పుకుని నా పాదాలకి సలాం కొట్టి వెళ్ళిపో’’.
అసలే పురుషాహంకారి ఐన రాజాకు ఒళ్లు మండింది. ‘ఈమె ఆడదేనా? అంత ఒళ్లేసుకుని సిగ్గూఎగ్గూ లేకుండా ఆ తీరేమిటి? తొడగొట్టడమేమిటి? తనేనా అంత చేవలేనివాడు? వివాహబంధం తెగిపోయింది కాబట్టి, వావీవరసా బాధలేదు. వెళ్లేటప్పుడు తన తడాఖా ఏమిటో చూపించే వెళ్లాలి.’ అనుకొని ఒకడుగు ముందుకేసి ఆమెను గట్టిగా కౌగలించుకుని పెదాలు గాఢంగా చుంబించాడు. పురుషస్పర్శ తెలియని ఇందిరలో ఏవో తంత్రులు కదిలాయి. తనువులో అగ్ని పుట్టుకొచ్చి మంచుకొండ లాటి ఆమెను అతి త్వరగా కరిగించసాగింది. రాజా ముద్దుపెట్టడం ముగించగానే ప్రతిగా తానూ పెట్టింది.. దీర్ఘంగా, లోతుగా. కళ్లు మూతపడుతూ, వివశురాలై అతని శరీరానికి అల్లుకోసాగింది.
ఆమె స్పందన కారణంగా రాజాకు మైమఱపు కలుగుతూ ఆమెను ఆక్రమించబోతూండగా యింతలో నువ్వు చేస్తున్న పనేమిటి అంటూ వీపు మీద ఎవరో ఛెళ్లున చరిచినట్లయింది. ఉలిక్కిపడి ఆమె ఆలింగనాన్ని సున్నితంగానే విడిపించుకుని, ఆమెకు దూరంగా జరుగుతూ ‘సారీ’ అన్నాడు. ‘ఇలా ఎవరితోనూ ప్రవర్తించలేదు. ఆవేశంలో వివేకం కోల్పోయాను.’ అన్నాడు. ఇందిర తమకంగానే అతని కళ్లలోకి చూసి, కళ్లు దించుకుని బయటి గదికి వెళ్లిపోయింది. రాజా తల పట్టుకుని మంచంపై కూలబడ్డాడు. కాస్సేపటికి బాత్‌రూముకి వెళ్లి మొహం కడుక్కుని వస్తూండగా ఇందిర వీధిలో బండివాడితో ‘‘ఇల్లు మారటంలేదు. బాడుగ ఇస్తాను వెళ్లిపో’’ అని చెప్తోంది.
లోపలికి వచ్చి రాజాను చూసి, ‘కాఫీ యిస్తాను, తాగుదురు గాని’ అంది. రాజా తలూపి, బెంచి మీద కూర్చున్నాడు. ఇద్దరూ కాఫీ తాగుతూండగా ఇందిర ‘‘రూప సాయంత్రానికి వచ్చేస్తుంది. మీ బట్టలన్నీ లోపల సర్దేద్దాం ఈలోపల” అంది. “నిజంగానా!? అయితే నా అబ్జర్వేషన్ కరెక్టని ఒప్పుకుంటున్నారా?’’ అన్నాడు ఆనందాశ్చర్యాలతో రాజా. ‘‘చవి చూశాక ఒప్పుకోక తప్పుతుందా? లేశప్రాయమే యిలా ఉన్నపుడు పూర్తి స్థాయి ఆనందం యింకెలా ఉంటుందో ఊహకందటం లేదు. మీరన్నది నిజం. భగవంతుడి సృష్టి దీనిమీద ఆధారపడి వున్నప్పుడు కాదనడం మూర్ఖత్వం, ప్రకృతికి విరుద్ధంగా ఉండడం సృష్టికర్తను అవమానించినట్లే..’’ అంటూ సిగ్గుపడింది ఇందిర,
ఆమె ముఖంలో సిగ్గు మొదటిసారిగా చూసిన రాజాకు ఆమె మనోహరంగా అనిపించింది. మొహం కడుక్కుని, తల శుభ్రంగా దువ్వుకుని మంచి బట్టలు పద్ధతిగా వేసుకుంది. ‘గ్రూమింగ్ లేక అలా తయారైంది కానీ యీమెలోనూ అందం, ఆడతనం ఉంది’ అనిపించింది అతనికి. ‘‘రక్షించారు. మీకు జ్ఞానోదయం అయిందంటే మా కాపురం ఇక మూడు పువ్వులూ, ఆరు కాయలే అన్నమాట’’ అంటూ ఆనందం వెల్లడించాడు. ‘‘ఈ పుణ్యానికి బదులుగా నాకో అన్నగార్ని వెతికి పెడతాను.’’ అంటూ చేర్చాడు. ‘‘ఆ పనేదో త్వరగా చేయండి. ఇప్పటికే కాలాతీతమై, చాలా కోల్పోయాను. అదంతా కాంపెన్సేట్ చేయాలి’’ అంది ఇందిర కన్నుగీటుతూ.
గొప్ప రిలీఫ్ ఫీలై, యిద్దరూ పగలబడి నవ్వారు.
రిక్షా దిగి ఇంట్లోకి వస్తున్న రూపకి తనక్కావలసిన ఇద్దరూ అక్కయ్యా, భర్తా ఒకే ఇంట్లో నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూండడం చూసి ఎంతో హాయిగా తోచిందే. వచ్చి అక్కని కౌగలించుకుంది. మొగుణ్ణి చూసి సిగ్గుపడింది. తను లేనప్పుడు ఏం జరిగిందో, వీళ్లిద్దరి మధ్య ఎలా సయోధ్య కుదిరిందో ఆమె పట్టించుకోలేదు. అంత సాయిబాబా దయ అనుకొని సంతోషించింది. (‘వ్యథావనితాయణం’ సీరీస్‌లో మరో కథ వచ్చే నెలలో)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)