ఏపీలో పెట్టుబడులు లేవు. పంచుడులే తప్ప అంటూ విపక్షాలు రాద్ధాంతాలతో ఏపీ జనం చెవులకు తుప్పు పట్టింది. ఎంతసేపూ సంక్షేమ పధకాలేనా అసలు పాలన తెలుసా అంటూ జగన్ని అలుసుగా తీసుకుని మాట్లాడిన విపక్షాలకు అన్నింటికీ ఒక్క దెబ్బతో జగన్ నోరు మూసేశారు. చాలా తక్కువ టార్గెట్ తో విశాఖలో పెట్టుబడుల సదస్సుని నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం ఇపుడు దానికి ఏడు రెట్లు ఎక్కువగా పెట్టుబడులను సాధించడం అంటే ఏపీ దశ తిరిగినట్లే అంటున్నారు.
రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి గుడివాడ అమరనాధ్ చెబుతూ వచ్చారు అంతకు మించి వస్తే అయిదు పది లక్షల కోట్ల దాకా రావచ్చు అని ఆయన అన్నారు. అయితే జగన్ ఏపీకి రియల్ గా ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయో తెలియచేశారు. పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి జగన్ క్లారిటీగా లెక్కలు చెప్పారు.
అందులో తొలి రోజు వాటా తొమ్మిది లక్షల కోట్లుగా ఉంది. దీనికి సంబంధించి అవగాహన ఒప్పందాలు మొదటి రోజే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన నాలుగు లక్షల కోట్లు పెట్టుబడుల సదస్సు అయిన రేపు ఎంఓయూలు కుదురుతాయని జగన్ చెప్పారు. ఏపీ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని జగన్ ధీమాగా చెప్పడం విశేషం.
ఈ రోజు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఆయన అన్నారు. ఏపీలో అనేక కీలక రంగాలు ఉన్నాయని వాటిలో పెట్టుబడులు పెట్టడానికే ఈ సదస్సుని నిర్వహించామని ఆయన చెప్పారు. మొత్తం పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ఆరు లక్షల దాకా ఉద్యోగ అవకాశాలు ఏపీలో వస్తాయని జగన్ చెప్పారు.
విభజన ఏపీలో తొమ్మిదేళ్ళ తరువాత ఆశ రేఖగా పెట్టుబడుల సదస్సు నిలిచింది అని అంతా అంటున్నారు. మేధావులు ఆర్ధిక నిపుణులు పారిశ్రామికవేత్తలు సైతం ఏపీ ప్రభుత్వ పాలసీని మెచ్చుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సమయం ఇదే అంటున్నారు. పెట్టుబడుల అడ్డాగా ఏపీని తీర్చిదిద్దడంతో వైసీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించింది అన్నదే అందరి మాటగా ఉంది.