ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సుని వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తే ఈ సదస్సుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై వరాలు కురిపించారు.
ఏపీలో జాతీయ రహదారులు మౌలిక సదుపాయాల కల్పనకు ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించినట్లుగా గడ్కరీ తెలిపారు. అందులో విశాఖలో ఒక కీలకమైన ప్రాజెక్ట్ ఉందని ఆయన వెల్లడించారు. ఆరు వేల కోట్ల రూపాయలతో విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు దాకా యాభై అయిదు కిలోమీటర్ల దూరంతో ఆరు లైన్ల రోడ్లను వేయబోతున్నామని అన్నారు.
ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని గడ్కరీ సభా ముఖంగా చెప్పడం విశేషం. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం ద్వారా విశాఖ బీచ్ రోడ్డు రూపురేఖలు మారిపోతాయని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది భోగాపురం లో అంతర్జాతీయ విమానాశ్రయం రానుంది. విశాఖతో అనుసంధానం కావడం కోసం ఆరు లైన్ల రోడ్ ప్రాజెక్ట్ ని మంజూరు చేయాలని వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దానికి అనుగుణంగా కేంద్ర మంత్రి పెట్టుబడుల సదస్సు వేదిక పైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ప్రాజెక్ట్ కనుక కార్యరూపం దాలిస్తే విశాఖ విజయనగరం జిల్లాల మధ్య దూరం చెదిరిపోతుంది. యాభై అయిదు కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డు అంతా టూరిజం స్పాట్ అవుతుందని, దానికి తగిన వాతావరణం ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోంది. దాన్ని కేంద్రం అంగీకరించడం ద్వారా జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేసింది.