చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఇవాళ తిరుపతి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజ మంచిని ఆకాంక్షిస్తూ మంచి మాటలు చెప్పారు. అయితే గత కొంత కాలంగా ఆమె కేంద్రంగా ఏపీలో వికృత రాజకీయ క్రీడకు తెరలేపడంతో… తాజాగా ఆమె వ్యాఖ్యలు కొందరిని దృష్టిలో పెట్టుకుని చేసినవేమో అన్న అనుమానం కలుగుతోంది.
తిరుపతిలో 48 మంది వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని భువనేశ్వరి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ అసూయ, ద్వేషాల స్థానంలో ప్రేమను పంచాలని సూచించారు.
కష్ట సమయంలో తాత్కాలికంగా ఆర్థిక బాధలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి సహాయం అందించామన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరవని వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని ఆమె హితవు పలికారు.
అన్ని వేళలా దయ కలిగి ఇతరులకు సాయపడదామని భువనేశ్వరి పిలుపునివ్వడం విశేషం. అయితే చివరిగా ఆమె అన్న …తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదనే హితవు తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని దృష్టిలో పెట్టుకుని చేసినవే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దయతో, ప్రేమతో మెలగాలనే ఆమె పిలుపు స్ఫూర్తి నింపేలా ఉందని చెప్పొచ్చు.